శ్రీశైలంలో వింత- తండోపతండాలుగా తరలిన భక్తజనం
Srisailam: ఏపీ నంద్యాల జిల్లాలో గల అత్యంత మహిమాన్విత పుణ్యక్షేత్రం.. శ్రీశైలం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇదీ ఒకటి. సాక్షాత్ పరమశివుడు ఇక్కడ మల్లికార్జున స్వామివారి రూపంలో వెలిశాడు. భ్రమరాంబ మల్లికార్జునుడిగా పూజలను అందుకుంటోన్నాడు. శ్రీశైలం రిజర్వాయర్, నల్లమల పులుల అటవీ సంరక్షణ కేంద్రం కావడం వల్ల వాటిని చూడటానికి వచ్చే పర్యాటకుల సంఖ్య సైతం వేలల్లోఉంటుంది.
రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగునే ఉన్న కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి రోజూ వేలాదిమంది భక్తులు శివయ్యను దర్శనం చేసుకుంటుంటారు. మహాశివరాత్రి నాడు శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునడిని దర్శించుకుని, జాగారణ చేస్తే సర్వదోషాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు.

శ్రీశైలం చుట్టు ప్రక్కల దాదాపు 500 వరకు శివలింగాలు వెలిశాయని చెబుతుంటారు. ఎన్నో దేవాలయాలు, మఠాలు, పురాణాలతో ముడిపడి ఉన్న అనేక స్థలాలు ఇక్కడ ఉన్నాయి. ఇటీవలే రోడ్డు విస్తరణ సందర్భంగా ఓ శివలింగం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. 15వ శతాబ్దానికి చెందిన శివలింగంగా దీన్ని పురావస్తు శాఖ అధికారులు ధృవీకరించారు కూడా.
పాతాళగంగ, సాక్షిగణపతి, హఠకేశ్వరం, భీముడి కొలను, పాలధార-పంచధార, అక్కమహాదేవి గుహలు, కదళీవనం గుహలు, మల్లెలతీర్థం, ఇష్టకామేశ్వరి ఆలయం, సలేశ్వరం.. వంటి ప్రదేశాలను సందర్శించగలిగితే గానీ శ్రీశైలం యాత్ర పూర్తి కాదని నమ్ముతారు. భ్రమరాంబ మల్లికార్జునుడి బ్రహ్మోత్సవాలు, మహా శివరాత్రి నాడు లక్షలాదిమంది భక్తులతో ఆయా ప్రాంతాలన్నీ కూడా కిటకిటలాడుతుంటాయి.
శ్రీశైలం పాతాళ గంగ వద్ద వెలసిన చంద్ర లింగానికి చుట్టుకున్న నాగుపాము ఇది చాలా అరుదైన చిత్రము .#Srisailam #snake #viral pic.twitter.com/7UWKyDh1aC
— ChotaNews (@ChotaNewsTelugu) July 16, 2024
శ్రీశైలంలో ప్రతి అణువూ శివ స్వరూపంగా భావిస్తుంటారు భక్తులు. అది నిజమేనని నిరూపించడానికి తాజాగా చోటు చేసుకున్న ఉదంతమే నిదర్శనం. ఓ శివలింగానికి ఓ నాగుపాము చుట్టుకుని కనిపించింది. కొన్ని గంటల పాటు అది కదల్లేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
శ్రీశైలం ప్రధాన ఆలయం నుంచి పాతాళ గంగకు వెళ్లే మార్గంలో గల చంద్రశిల శివలింగం ఆలయం వద్ద ఈ వింత ఘటన సంభవించింది. నాగుపాము చుట్టుకుని ఉన్న శివలింగాన్ని చూడటానికి భక్తులు తండోపతండాలుగా చేరుకున్నారు. దీన్ని తమ మొబైల్ ఫోన్‌లో బంధించారు.












Click it and Unblock the Notifications