"ఈ క్రెడిట్ ఎవరిది ?"- చంద్రబాబు, జగన్ కు మాజీ ఐపీఎస్ షాకింగ్ ప్రశ్న..!
ఏపీలో గత కొన్నేళ్లుగా అధికార, విపక్షాల మధ్య క్రెడిట్ వార్ కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వంలో ఉన్న వారు ఏదైనా ప్రాజెక్టులు చేపట్టినా, ప్రారంభించినా ఆ క్రెడిట్ తమదే అని చెప్పుకోవడం, విపక్షం వెంటనే ఎంటరైపోయి అది మా వల్లే అంటే క్రెడిట్ తమ ఖాతాలో వేసుకోవడం.. ఇలా క్రెడిట్ వార్ కొనసాగుతోంది. తాజాగా భోగాపురం ఎయిర్ పోర్టు, వెలిగొండ ప్రాజెక్టు, అనకాపల్లికి గోదావరి జలాల ఇచ్చే ప్రాజెక్టులపై ఇలాగే క్రెడిట్ వార్ జరిగింది. అప్పట్లో ఆయా విషయాలపై క్రెడిట్ వార్ చేసుకున్న అధికార కూటమి, విపక్ష వైఎస్సార్సీపీ.. ఇప్పుడు ఓ విషయంలో క్రెడిట్ తీసుకోవడానికి ముందుకు రారే అంటూ ఓ మాజీ ఐపీఎస్ చురకలు అంటించారు.
ఇంతకీ విషయానికొస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఏఆర్ఎస్ఎస్, ఏఎంఆర్ సంస్థలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ( ఈడీ) ఈ మధ్య దాడులు చేసింది. ఇందులో పలు కీలక పత్రాల్ని, ఆధారాల్ని స్వాధీనం చేసుకున్నట్లు తొలుత వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ వ్యవహారంపై ఈడీ ఆ రోజు కానీ, తర్వాత రోజు కానీ ప్రెస్ నోట్ విడుదల చేయాల్సి ఉండగా.. ఇప్పటికీ అది జరగలేదు. అదే సమయంలో ఆన్ లైన్ సైట్లలో వచ్చిన వార్తలు కూడా మాయం అయ్యాయని తెలుస్తోంది. పత్రికల్లో అయితే వార్తలే కనిపించలేదు. ఈ వ్యవహారంలో చంద్రబాబు, జగన్ ఎందుకు క్రెడిట్ తీసుకోవడం లేదంటూ మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswara Rao) ప్రశ్నిస్తున్నారు.

వార్తలు మాయం. ED దాడులు హుష్ కాకి
— ABV (@abvrao) September 18, 2026
ఈ విషయంలో క్రెడిట్ ఎవరిది?
దీన్ని గురించి జగన్ గారి ప్రెస్ మీట్, లోకేష్ గారి బస్తీ మే సవాల్, ఇరువైపులా భక్త జనుల హోరా హోరీ చూడాలని ప్రజల ఉత్సుకత.
మరి వారి సంతృప్తి స్థాయి ని ఒక IVRS కాల్ ద్వారా అంచనా వేస్తారా?
‘మహానాడు’ ఆన్ లైన్ దిన పత్రిక లింకు… pic.twitter.com/wIdngl4RBN
"వార్తలు మాయం. ఈడీ దాడులు హుష్ కాకి .. ఈ విషయంలో క్రెడిట్ ఎవరిది?" అంటూ ఏబీ వెంకటేశ్వరరావు తాజాగా ఓ ట్వీట్ చేశారు. దీన్ని గురించి జగన్ గారి ప్రెస్ మీట్, లోకేష్ గారి బస్తీ మే సవాల్, ఇరువైపులా భక్త జనుల హోరా హోరీ చూడాలని ప్రజల ఉత్సుకత అంటూ ఆయన పేర్కొన్నారు. మరి వారి సంతృప్తి స్థాయి ని ఒక IVRS కాల్ ద్వారా అంచనా వేస్తారా? అంటూ ప్రభుత్వాన్ని ఏబీ వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. దీంతో ఈ కీలకమైన ఈడీ దాడులపై అధికార, విపక్షాల్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. అయినా వారు నోరు మెదిపే అవకాశాలు కనిపించడం లేదు.














Click it and Unblock the Notifications
