గంజాయి డాన్ నీతూబాయికి ఈడీ షాక్.. 8చోట్ల ఆస్తులపై దాడులు, కీలక డాక్యుమెంట్లు!
హైదరాబాద్ నగరానికి చెందిన ప్రముఖ గంజాయి డాన్ నీతూ బాయ్ కి ఈడీ షాక్ ఇచ్చింది. గంజాయి వ్యాపారంతో పేరుగాంచిన నీతూబాయికి సంబంధించిన ఇళ్లు, ఆస్తులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తక్కువ కాలంలో గంజాయి దందాతో కోట్లు సంపాదించిందని, ఆ డబ్బును హవాలా మార్గాల ద్వారా తరలించింది అని ఆమె ఆస్తులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు చేశారు.
నీతూ బాయ్ కి సంబంధించిన ఆస్తులపై ఈడీ దాడులు
నీతూ బాయ్ కి సంబంధించిన ఆస్తులపై హైదరాబాద్ లోని ఎనిమిది ప్రాంతాల్లో ఈడీ తనిఖీల కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఎక్సైజ్ శాఖ నమోదు చేసిన కేసు ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో ఈడీ ఈ చర్యలు చేపట్టింది. నీతూబాయి గంజాయి అమ్మకాల ద్వారా కోట్ల రూపాయలు సంపాదించినట్లు అధికారులు గుర్తించారు. ఆ డబ్బును హవాలా మార్గాల ద్వారా తరలించి, వివిధ ఆస్తులు, లావాదేవీల రూపంలో మార్చినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి.

ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు ఖాతాలు, ఆస్తులపై ప్రత్యేక దృష్టి సారించి సోదాలు
అందుకే ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు ఖాతాలు, ఆస్తుల వివరాలపై ప్రత్యేక దృష్టి సారించి సోదాలు చేస్తున్నారు. సోదాల్లో కీలక పత్రాలు, నగదు లావాదేవీల రికార్డులు, ఆస్తులకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నట్లు సమాచారం. ఈ కార్యకలాపాలు పూర్తయిన తర్వాతే ఈడీ అధికారులు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. గంజాయి వ్యాపారం నుంచి వచ్చిన అక్రమ ఆదాయాన్ని రికవరీ చేసే అంశంపైన దృష్టి సారించి ఈ చర్యలు జరుగుతున్నాయి.
పోలీసులకు, ఈగల్ టీమ్ కు పెను సవాల్ విసిరిన నీతూ బాయ్
వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో జరుగుతున్న ఈ సోదాలు నీతూబాయి నెట్‌వర్క్ ను పట్టుకునేందుకు దోహదం చేస్తాయని భావిస్తున్నారు. ఇప్పటికే గంజాయి కేసులో పట్టుబడి జైలు పాలు అయినప్పటికీ, మళ్లీ గంజాయి దందా కొనసాగిస్తూ పోలీసులకు, ఈగల్ టీమ్ కు పెను సవాల్ విసిరారు గంజాయి డాన్ నీతూబాయ్.
ఇటీవల ఆమె ఇంటి ముందు కిరాణా షాప్ కూల్చివేసిన మున్సిపల్ అధికారులు
హైదరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలోని నానక్ రాం గూడా లోధా బస్తీలో ఉన్న ఆమె ఇంటి ముందు రోడ్డు ఆక్రమించి నిర్మించిన కిరాణా దుకాణాన్ని, రేకుల షెడ్డు ను ఇటీవల మున్సిపల్ అధికారులు కూల్చి వేశారు. ఈ కిరాణ దుకాణం కేంద్రంగా చేసుకొని ఐటి ఉద్యోగులకు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు నీతూ బాయ్ పెద్ద ఎత్తున గంజాయి సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. రోడ్డు ఆక్రమణల కింద ఈ నిర్మాణాలను ఇటీవల కూల్చివేశారు. ప్రస్తుతం ఆమె ఆస్తుల పైన ఈడి అధికారులు దాడులు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications