చివరి రోజుల్లో క్షోభను అనుభవించిన రామోజీ రావు: రాజేంద్ర ప్రసాద్
Ramoji Rao: ఈనాడు గ్రూప్ ఆఫ్ సంస్థల అధినేత, ప్రముఖ నిర్మాత రామోజీ రావు కన్నుమూశారు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులకు గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారు జామున 3:45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు.
ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ నెల 5వ తేదీన ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మూడు రోజుల పాటు చికిత్స తీసుకున్నారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. శుక్రవారం రాత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో వెంటిలేటర్‌పై రామోజీ రావుకు కృత్రిమ శ్వాసను అందించారు డాక్టర్లు. వారి ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ఈ తెల్లవారు జామున ఆయన కన్నుమూశారు.

తెలుగునాట మీడియా మొఘల్‌గా ఎదిగారు రామోజీ రావు. ఈనాడు దినపత్రిక, ఈటీవీ, ఈటీవీ భారత్ వంటి సంస్థలతో మీడియా రంగంలో సంచలనం సృష్టించారు. తనదైన ముద్ర వేశారు. తన పేరు మీద దేశంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీని నిర్మించారు. ప్రియా పేరుతో ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ సెగ్మెంట్‌లోనూ ఆయన అడుగులు వేశారు. అక్కడా విజయవంతం అయ్యారు.
రామోజీ రావు మృతిపట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోన్నారు. కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కల్యాణ్, నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్.. ఇలా రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
రామోజీ రావు భౌతిక కాయానికి రాజకీయ, తెలుగు చలని చిత్ర పరిశ్రమ ప్రముఖులు నివాళి అర్పిస్తోన్నారు. ఆయన మరణవార్త విన్న వెంటనే ఢిల్లీలో ఉన్న చంద్రబాబు నాయుడు హుటాహుటిన హైదరాబాద్‌కు తరలివచ్చారు. భౌతిక కాయానికి నివాళి అర్పించారు. ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌలి, ఎంఎం కీరవాణి, నటుడు రాజేంద్ర ప్రసాద్ సహా టాలీవుడ్ సెలెబ్రిటీలు నివాళి అర్పిస్తోన్నారు.
ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. దరిద్రపు, చెత్త రాజకీయాల వల్ల రామోజీ రావు చివరి రోజుల్లో మానసిక క్షోభను అనుభవించి వెళ్లారని అన్నారు. దీన్ని దేవుడు చూశాడని, అందుకే నిజాన్ని గెలిపించాడని వ్యాఖ్యానించారు. ఆ ఘన విజయాన్ని చూసే వెళ్లారని, అది చాలా చాలా సంతోషంగా ఉందని చెప్పారు. రామోజీ రావు తాను అనుకున్నది సాధించి వెళ్లారని రాజేంద్రప్రసాద్ అన్నారు.












Click it and Unblock the Notifications