రేవంత్ రెడ్డికి వైఎస్ జగన్ కంగ్రాట్స్-రెండు రాష్ట్రాల సంబంధాలపై మనసులో మాట..
తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఇవాళ హైదరాబాద్ ఎల్పీ స్డేడియంలో ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ తో పాటు పలువురు ముఖ్యమంత్రుల్ని ఆహ్వానించారు. అయితే కేవలం కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు మాత్రమే హాజరయ్యారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మాత్రం ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. అయితే సాయంత్రం మాత్రం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందిస్తూ ఎక్స్ లో ఏపీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ పెట్టారు. ఇందులో తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు అంటూ పేర్కొన్నారు. ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి, మంత్రులకు శుభాకాంక్షలు అంటూ తెలిపారు. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల మధ్య ఉండాల్సిన సంబంధాలపైనా సీఎం జగన్ మరో వాక్యం దీనికి జోడించారు.

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానంటూ వైఎస్ జగన్ ట్వీట్ లో పేర్కన్నారు. దీంతో గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ తరహాలోనే రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాల కోసం వైఎస్ జగన్ ఓ సందేశం పంపినట్లయింది. టీడీపీ నేపథ్యం ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గతంలో ఎప్పుడూ కలిసి మాట్లాడటం కానీ, పలకరించుకుకోవడం కానీ చేయని జగన్ ఇవాళ మాత్రం తోటి తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన్ను అభినందిస్తూ ట్వీట్ పెట్టడం మంచి పరిణామంగా భావిస్తున్నారు.













Click it and Unblock the Notifications