Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..!
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తాజాగా ముగిశాయి. అయితే ఈ నెల 28న అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఒక్కరోజు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తోంది. ఈ భేటీ వెనుక ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన అత్యవసర ఆదేశాలు ఉన్నట్లు సమాచారం. అయితే ప్రధాని కార్యాలయం ఈ ఆదేశాలు ఎందుకు ఇచ్చింది, ఈ ప్రత్యేక సమావేశంలో ఏం చర్చించబోతున్నారనేది ఇప్పుడు చూద్దాం..
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గతంలో అమరావతి(Amaravati)ని టీడీపీ సర్కార్ ఖరారు చేసినా కేంద్రం పార్లమెంట్ లో ఆమోదించి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయకపోవడంతో వైసీపీ ప్రభుత్వం రాగానే దాన్ని మార్చి మూడు రాజధానుల ఏర్పాటుకు సిద్దమైంది. దీంతో ఈసారి అలాంటి తప్పిదాలు జరగకుండా కూటమి ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఏపీ పునర్ విభజన చట్టాన్ని సవరించి ఏపీని రాజధానిగా చేర్చాలని కేంద్రాన్ని కోరుతోంది. దీంతో కేంద్రం కూడా తగు చర్యలు తీసుకుంటోంది.

ఇందులో భాగంగా అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంట్ లో చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. దీనికి ముందు ఏపీ అసెంబ్లీ నుంచి పార్లమెంట్ కు ఓ తీర్మానం వెళ్లాల్సి ఉంది. అది లేకుండా పార్లమెంట్ లో కేంద్రం నేరుగా సవరణ బిల్లు పెట్టి రాజధానిని గుర్తించడం సాధ్యం కాదు. ఈ మేరకు న్యాయనిపుణులు ఇచ్చిన సలహా మేరకు రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం వెంటనే చేసి పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి పీఎంవో సమాచారం ఇచ్చింది. దీంతో ఈ నెల 28న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ తీర్మానం చేస్తారు. అనంతరం దీన్ని కేంద్రానికి పంపుతారు. దీని ఆధారంగా పార్లమెంట్ లో కేంద్రం చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదిస్తుంది.












Click it and Unblock the Notifications