అమృత్ భారత్ స్టేషన్స్: ఏపీలో 72 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ.. లిస్ట్ ఇదే!!
అమృత్ భారత్ స్టేషన్ల కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయవాడతో పాటు 72 స్టేషన్లను రైల్వే శాఖ అభివృద్ధి చేయడానికి శ్రీకారం చుట్టింది.
అమృత్ భారత్ స్టేషన్ల కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయవాడతో పాటు 72 స్టేషన్లను రైల్వే శాఖ అభివృద్ధి చేయడానికి శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైల్వే స్టేషన్లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి అమృత భారత స్టేషన్స్ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 1275 రైల్వే స్టేషన్లను ఆధునీకరించాలని నిర్ణయం తీసుకుంది. ఇక ఈ నిర్ణయంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 72 రైల్వే స్టేషన్లను ఎంపిక చేసి వాటి రూపురేఖలను మార్చనుంది.

ఏపీలో రైల్వే స్టేషన్లకు మహర్దశ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే స్టేషన్లకు మహర్దశ పట్టబోతోంది. రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ప్రత్యేక మాస్టర్ ప్లాన్లను రూపొందిస్తున్న రైల్వే శాఖ వర్గాలు, రాష్ట్రంలో ఎంపిక చేసిన 72 స్టేషన్లలో త్వరలోనే ఆధునికీకరణ పనులు చేపడతామని పేర్కొంది. ఈ మేరకు మాస్టర్ ప్లాన్లను రూపొందించడానికి నిపుణుల కమిటీలను నియమిస్తామని రైల్వే శాఖ వర్గాలు వెల్లడించాయి. మాస్టర్ ప్లాన్లను రూపొందించిన తర్వాత దశలవారీగా పనులు చేపడతామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమృత్ భారత్ స్టేషన్లలో భాగంగా అభివృద్ధి చేసే రైల్వేస్టేషన్ల వివరాల్లోకి వెళితే

ఏపీలో ఆధునికీకరణకు నోచుకున్న రైల్వే స్టేషన్లు ఇవే
విజయవాడ ,విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ టౌన్, ఏలూరు, విజయనగరం, అనకాపల్లి, అరకు, భీమవరం టౌన్, బొబ్బిలి, చీపురుపల్లి, తిరుపతి, అనంతపురం, తెనాలి, గుంటూరు, అనపర్తి, బాపట్ల, చీరాల, చిత్తూరు, కడప, కంభం, ధర్మవరం, డోన్, దొనకొండ, దువ్వాడ, ఎలమంచిలి, ఏలూరు, గిద్దలూరు, గుత్తి, గుడివాడ, గూడూరు, గుణదల, హిందూపూర్, ఇచ్చాపురం, కదిరి, కొత్తవలస, కుప్పం, కర్నూల్ సిటీ, మాచర్ల, మచిలీపట్నం, మంగళగిరి, మదనపల్లి రోడ్, మార్కాపురం రోడ్డు, మంత్రాలయం రోడ్, నడికుడి, నంద్యాల, నరసరావుపేట, నరసాపూర్, నౌపడ, నెల్లూరు, నిడదవోలు, ఒంగోలు, పాకాల, పలాస, పార్వతీపురం, పిడుగురాళ్ల, పీలేరు, రాజంపేట, రాయనపాడు, రేణిగుంట, రేపల్లె, సామర్లకోట, సత్తెనపల్లి, సింహాచలం, సింగరాయకొండ, శ్రీకాళహస్తి, శ్రీకాకుళం రోడ్, సూళ్ళూరుపేట, తాడేపల్లిగూడెం, తుని, తాడిపత్రి, వినుకొండ లలో రైల్వే స్టేషన్లను ఆధునికరించడానికి రైల్వే శాఖ నిర్ణయం తీసుకోవడంతో, ఈ రైల్వే స్టేషన్ లకు మహర్దశ పడుతుందని ఆంధ్రప్రదేశ్ వాసులు సంతోషంతో ఉన్నారు.

రైల్వే స్టేషన్లలో కల్పించే మౌలిక వసతులు ఇవే
అమృత్ భారత్ కింద అభివృద్ధి చేసే రైల్వే స్టేషన్లలో కల్పించే కొన్ని మౌలిక సదుపాయాలను చూసినట్లయితే ప్రతి స్టేషన్లలో అవసరమైన భవనాల నిర్మాణం, అధునాతన శైలిలో ఫ్లోరింగ్ చేయనున్నారు. ప్రస్తుతం 600 మీటర్ల పొడుగుతున్న ప్లాట్ ఫామ్ లను 760 మీటర్ల నుంచి 840 మీటర్ల వరకు అవసరం మేరకు పెంచనున్నారు. ప్రయాణికులు తాకిడి ఎక్కువగా ఉండే ఎన్ ఎస్ జీ 1- 4, ఎన్ జీ 1-2 కేటగిరి స్టేషన్లలో ఎస్కలేటర్లను ఏర్పాటు చేయనున్నారు.

స్టేషన్లలో అధునాతన ఏర్పాట్లు
రైల్వే స్టేషన్లలో ట్రాకులు, వాటి శుభ్రత కోసం సులభమైన నిర్వహణ కోసం అధునాతన ఏర్పాట్లను చేయనున్నారు. వెయిటింగ్ హాల్స్ నిర్మాణం వాటికి అనుబంధంగా కెఫెటేరియాల నిర్మాణం చేపట్టనున్నారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా వీల్ చైర్లు, వారికి ప్రత్యేకమైన ప్రవేశ మార్గాలు ఏర్పాటు చేయనున్నారు. స్టేషన్ కు రెండు వైపులా అప్రోచ్ రోడ్లు, పార్కింగ్ ఏరియా, పాదచారులకు ప్రత్యేక దారి వసతులను కల్పించనున్నారు. స్థానిక ఉత్పత్తుల విక్రయాలకు కనీసం రెండు స్టాల్స్ ను ఏర్పాటు చేయాలని, ప్రతి స్టేషన్ మొదటి అంతస్తులో ప్రత్యేకంగా రూఫ్ ప్లాజా ను ఏర్పాటు చేయాలని, సమావేశ మందిరాలను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఏపీలో 72 రైల్వే స్టేషన్లకు కొత్తదనం
ఇక ల్యాండ్ స్కేపింగ్ తో పాటుగా ఆధునిక లైటింగ్ వసతులను, స్టేషన్లో ప్రయాణికులకు వేగవంతమైన వైఫై సేవలు అందించటానికి 5 జీ టవర్లను ఏర్పాటు చేయనున్నారు. అన్ని అధునాతన హంగులతో దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ఆధునికీకరించే క్రమంలో ఏపీలో 72 రైల్వే స్టేషన్లు కొత్తదనాన్ని సంతరించుకోనున్నాయి.












Click it and Unblock the Notifications