వైసీపీకి మరో ఎమ్మెల్సీ గుడ్ బై-చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక..!
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార వైసీపీకి ఎదురుదెబ్బలు తప్పడం లేదు. ముఖ్యంగా కీలకమైన నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేసి విపక్ష టీడీపీలో చేరిపోతున్నారు. ఇదే క్రమంలో ఇప్పటికే విశాఖకు చెందిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ వైసీపీని వీడి జనసేనలో చేరిపోగా.. ఇవాళ కడప జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్సీ అదే బాట పట్టారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.

ఎన్నికల వేళ రాజకీయ పార్టీల్లో వలసలు సహజమే అయినా అధికార పార్టీలో నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారు సైతం విపక్ష పార్టీలో చేరిపోతుండటం కలకలం రేపుతోంది. ఇవాళ అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య ఆ పార్టీని వీడి టీడీపీలో చేరిపోయారు. చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు. గతంలో కాంగ్రెస్, టీడీపీల్లో పనిచేసిన ఆయన.. ఇవాళ మరోసారి టీడీపీలో చేరారు.
టీడీపీలో చేరిన సందర్భంగా సి.రామచంద్రయ్య ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం మళ్లీ కోలుకోలేని విధంగా జగన్ అప్పులు చేశారని ఆయన మండిపడ్డారు. ప్రజల చర్మం వలిచి పన్నులు కట్టిస్తే తప్ప జగన్ చేసిన అప్పులు తీరవని రామచంద్రయ్య తెలిపారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిపై జగన్ కు చెప్పినా వినే పరిస్దితి లేదన్నారు. అందుకే టీడీపీలో చేరుకున్నట్లు తెలిపారు. తనలాగే వైసీపీలో చాలా మంది ఉన్నారని రామచంద్రయ్య చెప్పుకొచ్చారు. వారంతా సమయాన్ని బట్టి బయటికి వస్తారన్నారు.












Click it and Unblock the Notifications