ఏపీలో ఎన్నికలు వాయిదా పడినా ఆ ఐదువేల కోట్లకు ఢోకా లేనట్లేనా ? మరి జగన్ ఎందుకలా చెప్పారు ?
ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికలు ఆరు వారాల పాటు వాయిదా వేయడం వల్ల వాటికి 14వ ఆర్ధిక సంఘం నుంచి రావాల్సిన 5 వేల కోట్ల రూపాయల నిధులు మురిగిపోతున్నాయని సీఎం జగన్ చెప్పారు. అయితే ఇది నిజం కాదని తెలుస్తోంది. ఓ ప్రత్యేక కారణంతో ఈసీ ఈ ఎన్నికలను వాయిదా వేసినందున, రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేని కారణంతో ఈ నిధులను గడువు ముగిసిపోయినా రాష్ట్ర ప్రభుత్వం క్లెయిమ్ చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ముగుస్తున్న 14వ ఆర్ధిక సంఘం గడువు..
ఏ రాష్ట్రంలో అయినా రాజ్యాంగ నిబంధనల మేరకు స్ధానిక ఎన్నికల నిర్వహణ సక్రమంగా జరిగి సదరు సంస్ధలు ప్రజా సేవలో నిమగ్నమైతే వాటికి నిధులు కేటాయించి బలోపేతం చేయాలని రాజ్యాంగం చెబుతోంది. అయితే ఏ కారణాల వల్ల అయినా స్ధానిక సంస్దల గడువు పూర్తయి నిర్ణీత సమయంలోగా ఎన్నికలు జరగపోతే మాత్రం ఈ నిధులు రాష్ట్రాలకు రావు. వాటిని మురిగిపోయినట్లుగానే భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏపీలో స్ధానిక సంస్ధల నిర్వహణ ఇంతా హడావిడిగా నిర్వహించడం వెనుక కారణం కూడా ఇదే. ఈ నెల 31తో ఆర్ధిక సంవత్సరం ముగుస్తుంది. అలాగే 14వ ఆర్ధిక సంఘం గడువు కూడా ముగిసిపోయి 15వ ఆర్ధికసంఘం అమల్లోకి రాబోతోంది. ఈ లోగా 14వ ఆర్ధిక సంఘం నుంచి రాబట్టాల్సి నిధులు మురిగిపోకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఈ నెల31లోగా స్ధానిక ఎన్నికలు నిర్వహించాల్సిందే.

కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మినహాయింపు..
ఆర్ధిక సంఘం నిధులను స్దానిక సంస్ధలకు ఇప్పించుకోవాలంటే ఎన్నికల నిర్వహణ, అవి పనిచేస్తూ ఉండటం తప్పనిసరి. అలా కుదరకపోతే నిధులు రావు. కానీ కొన్ని ప్రత్యేక కారణాల వల్ల రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండానే నిర్ణీత గడువులోగా ఎన్నికలు పూర్తి కాకుండా వాయిదా పడుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్దన మేరకు కేంద్రం మినహాయింపు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో గడువు దాటిపోయాక కూడా ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత సదరు నిధులను క్లెయిమ్ చేసుకుంటే సరిపోతుంది.

ఏపీలో ఎన్నికల వాయిదాకు వర్తిస్తుందా
ఏపీలో ఈసార ఎన్నికల వాయిదాకు ఈసీ చెప్పిన కారణం కరోనా వైరస్. ప్రపంచవ్యాప్తంగా దేశదేశాలను కుదిపేస్తున్న కరోనా వైరస్ ప్రభావం రాష్ట్రంపైనా తీవ్రంగా ఉందని, ఇలాంటి తరుణంలో ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలపై ప్రభావం పడుతుందని పేర్కొంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండానే ఎన్నికల ప్రక్రియ వాయిదా పడింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ ప్రభావం ఏడాది పాటు ఉంటే అప్పటివరకూ ఎన్నికలు నిర్వహించరా ఇదేం తీరు అంటూ ఈసీపై జగన్ కన్నెర్ర చేశారు. అయితే కరోనా వంటి విపత్కర పరిస్ధితులు తలెత్తినప్పుడు మినహాయింపు కోరే అవకాశాలున్నాయనే విషయం ఆయన దృష్టికి వెళ్లలేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఆర్ధికసంఘం నిధులపై జగన్ తెలిసే చెప్పారా..
ఈ నెలాఖరులోగా స్ధానిక సంస్ధల ఎన్నికలు జరగకపోతే 14వ ఆర్ధిక సంఘం నిధులు 5 వేల కోట్లు మురిగిపోతాయని, ఓ పది రోజులు ఆగితే ఆ సమస్య ఉండేది కాదని జగన్ చెప్పుకొచ్చారు. అయితే ఇలాంటి ప్రకృతి విపత్తులు తలెత్తినప్పుడు కేంద్రానికి ప్రత్యేకంగా అభ్యర్దన పంపితే పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని ఆయనకు అధికారులు చెప్పలేదా అన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే అధికారుల నుంచి ఈ మాత్రం వివరణ లేకుండానే సీఎం మాట్లాడి ఉండరన్న వాదన కూడా ఉంది. అయితే రాజకీయంగా ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ను ప్రజల్లో దోషిగా నిలబెట్టే ప్రయత్నాల్లో భాగంగా జగన్ ఈ విషయాన్ని కావాలనే దాచిపెట్టి ఈ విమర్శలు చేసి ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications