76 ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయనిది చేస్తున్నాం-పంద్రాగస్టు ప్రసంగంలో జగన్..రాజధానులపైనా..
ఏపీలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వేడుకలు మిన్నంటుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో సీఎం, మంత్రులు, స్ధానిక ప్రజాప్రతినిధులు పతాకావిష్కరణలు చేస్తున్నారు. ఇదే క్రమంలో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్డేడియంలో సీఎం వైఎస్ జగన్ పతాకావిష్కరణ చేశారు. అనంతరం ప్రత్యేక వాహనంలో స్టేడియంలో తిరుగుతూ సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత రాష్ట్రానికి చెందిన పలు బెటాలియన్ల పరేడ్ ను తిలకించారు.అనంతరం వైఎస్ జగన్ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగం చేశారు.

గాంధీజీ శాంతి సందేశాన్ని, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ సాహసాన్ని, టంగుటూరి, అల్లూరి, పింగళి త్యాగనిరతిని, లక్షలాది స్వాతంత్ర సమరయోధుల బలిదానాన్ని గుర్తుచేస్తూ జాతీయ జెండా ఎగురుతూ ఉందని జగన్ తెలిపారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ జరిగిన స్వాతంత్ర పోరాటానికి ప్రతీక అన్నారు. చెక్కుచెదరని సమైక్యతకు, భిన్నత్వంలో ఏకత్వానికి చిహ్నం అన్నారు. 76 ఏళ్ల క్రితం మన పూర్వీకుల త్యాగాల మీద సాధించిన స్వాతంత్రానికి గుర్తని తెలిపారు. రాష్ట్ర ప్రజల తరఫున జెండాకు సెల్యూట్ చేశారు.
వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో సుదీర్ఘమైన 76 ఏళ్ల కాలంలో ఎంతో ప్రగతి సాధించామని, స్ధిరంగా కనిపించే ఈ వేగాన్ని అందుకునే అవకాశాలు తగినంతగా రాని కుటుంబాలు, వర్గాలు, ప్రాంతాలు ఇంకా ఉన్నాయన్నారు. వీరి ఆకాంక్షల్ని, అవసరాల్ని, ప్రగతిని దృష్టిలో ఉంచుకుని గత 50 నెలలుగా ఏపీ ప్రభుత్వం ఎన్నో మార్పులు చేసింది. ఇందులో మొదటిది గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఇంగ్లీష్ మీడియం స్కూళ్ల ఏర్పాటుతో గ్రామ స్వరాజ్యానికి అర్దం తెచ్చామన్నారు. వీటితో పాటు బ్రాడ్ బ్యాండ్ సదుపాయంతో డిజిటల్ లైబ్రరీలు నిర్మిస్తున్నామన్నారు. 76 ఏళ్లలో భారత్ లో ఏ ప్రభుత్వం చేయని మార్పు అన్నారు.
పెన్షన్, రేషన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇంటింటికీ సేవలు అందిస్తున్నట్లు జగన్ తెలిపారు. ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్ధ తెచ్చామన్నారు. 76 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఏ ప్రభుత్వం కూడా తీసుకురాని మార్పు అన్నారు. 50 నెలల్లో 2.31 లక్షల కోట్లను నేరుగా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా లబ్దిదారుల రాజకీయ పార్టీలు కూడా చూడకుండా పేదల చేతికి అందించామన్నారు. పారదర్శకంగా లబ్దిదారుల జాబితాల్ని తయారు చేయడం, సోషల్ ఆడిట్ చేయిస్తున్నట్లు జగన్ తెలిపారు.
సామాజిక న్యాయం నినాదం కాదు అమలు చేసే విధానం అని నిరూపిస్తూ ఐదుగురు డిప్యూటీ సీఎంలలో నలుగురు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజిక వర్గాలకే ఇచ్చామన్నారు. ఆలయ బోర్డుల్లోనూ, వ్యవసాయ మార్కెట్ కమిటీల్లోనూ చట్టం చేసి మరీ 50 శాతం పదవులు వీరికే ఇచ్చామన్నారు. వికేంద్రీకరణను విధానంగా మార్చుకుని 13 జిల్లాలకు తోడు మరో 13 జిల్లాలు ఏర్పాటు చేశాం. రాజధానుల్ని కూడా 3 ప్రాంతాల హక్కుగా వికేంద్రీకరణ చేయబోతున్న ప్రభుత్వం కూడా మనదే అన్నారు. 15 వేలకు పైగా గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుతో వికేంద్రీరణలో సరికొత్త అధ్యాయం ప్రారంభించామన్నారు.
నాలుగేళ్ల కాలంలోనే దొరలపై యుద్ధం ప్రకటించామని జగన్ తెలిపారు. అంటరానితనమంటే పేదలు చదువుకునే ప్రభుత్వ బడిని పాడుబెట్టడం, డబ్బున్న వాళ్లకు ఓ మీడియం, పేదలు తెలుగు మీడియంలోనే చదవాలని వాదించడం కూడా అన్నారు. పేదల ఆస్పత్రుల్లోసేవలు అందకుండా చేయడం, పేదల్ని బస్సుల్లో ఎక్కనివ్వకుండా చేయడం అన్నారు. కోర్టుల్లో రకరకాల కేసులేసి పేదల ఇళ్లస్ధలాల్ని అడ్డుకోవడం కూడా అంటరానితనమే అన్నారు. పౌరసేవల కోసం పేదలు, మధ్యతరగతి వారు కార్యాలయాల చుట్టూ తిరిగేలా వారి సహనం పరీక్షించడం కూడా అంటరానితనమే అన్నారు.
గొప్పదైన ఈ ప్రజాస్వామ్యంలో కూడా ఎప్పటికీ అధికారం అందుకోలేమని ఏ కుటుంబం, సామాజిక వర్గం అనుకోకుండా చూస్తేనే స్వాతంత్రానికి నిజమైన అర్ధమని జగన్ తెలిపారు. అదే మన నవరత్నాల పాలన అన్నారు. మ్యానిఫెస్టోను ఎన్నికలు కాగానే చెత్తబుట్టలో పడేసే దుష్ట సంప్రదాయాన్ని పక్కనబెట్టి.. పక్కాగా అమలు చేసి చూపించామన్నారు. గడప గడపకూ వెళ్లి ఆ మ్యానిఫెస్టో అమలు చేసినట్లు చూపించామన్నారు. అర్హత ఉండి ఏ ప్రభుత్వ పథకం అందుకోలేని వారికి న్యాయం చేసేందుకు జగనన్న సురక్ష అమలు చేశామన్నారు.












Click it and Unblock the Notifications