హోంమంత్రి అనితపై గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఫైర్, కూటమినేతలకు సూచన!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు, ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న తీవ్ర విమర్శలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితను ఉద్దేశించి మేకప్ మంత్రి అని చేసిన వ్యాఖ్యలపై స్పందించిన పవన్ కళ్యాణ్ ఆ వ్యాఖ్యలను ఖండించారు.
ప్రజాప్రతినిధుల వ్యక్తిగత జీవితాలపై బురదజల్లడం మంచిది కాదు: పవన్ కళ్యాణ్
ప్రజా జీవితంలో సుదీర్ఘ కాలం కొనసాగుతున్న నాయకులకు తాము మాట్లాడే ప్రతి మాటపైనా కనీస బాధ్యత ఉండాలని, ప్రజలు ప్రతి విషయాన్నీ నిశితంగా గమనిస్తూనే ఉంటారని హితవు పలికారు.రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఎప్పుడూ విధానపరంగానే సాగాలని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ఏదైనా పాలసీ నచ్చకపోతే, ఆ విధానంలో ఉన్న లోపాలను నిశితంగా విమర్శించవచ్చని, కానీ ప్రజాప్రతినిధుల వ్యక్తిగత జీవితాలపై బురదజల్లడం సరికాదన్నారు.

మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరం: పవన్ కళ్యాణ్
ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలపై సమానంగా ఉంటుందని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు.హోంమంత్రి వంగలపూడి అనితను ఉద్దేశించి మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరంగా ఉన్నాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మహిళల కట్టూబొట్టుపై మాట్లాడే స్థాయికి రాజకీయ నాయకులు దిగజారిపోవడం శోచనీయమన్నారు.
మహిళల ఆత్మ గౌరవం దెబ్బ తీసేలా మాజీ మంత్రి వ్యాఖ్యలు
ఈ అనుచిత వ్యాఖ్యలు కేవలం ఒక మహిళా మంత్రిని మాత్రమే కాకుండా, సమాజంలోని సగటు మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలకు స్త్రీల పట్ల కనీస గౌరవం లేదనే విషయం ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోందన్నారు.వ్యక్తిగత ప్రసంగాల ద్వారా ప్రత్యర్థులను ఇరుకున పెట్టాలని చూసే రాజకీయ ధోరణులకు ముగింపు పలకాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
కూటమి నేతలకు పవన్ కళ్యాణ్ మార్గదర్శనం
ఇదే నేపథ్యంలో కూటమి పార్టీలకు చెందిన శాసనసభ సభ్యులు, మంత్రులు, కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ పలు సూచనలు చేశారు. సవాల్ విసిరేందుకు సిద్ధంగా ఉన్న శత్రు పక్షాల వ్యాఖ్యలను అంతే బలంగా తిప్పికొట్టాలని సూచించారు. అలా తిప్పికొట్టేటప్పుడు కూడా మనం పౌర సమాజం హర్షించే మంచి భాషను మాత్రమే ఉపయోగించాలే తప్ప దిగజారకూడదని పిలుపునిచ్చారు.
ప్రతీ మాటా హుందాగా మాట్లాడాలన్న పవన్ కళ్యాణ్
అవతలి వారు సంస్కార హీనంగా మాట్లాడినంత మాత్రాన కూటమికి అలాంటి అలవాట్లు అవసరం లేదంటూ గట్టిగా వ్యాఖ్యానించారు. మనం మాట్లాడే ప్రతి మాటా హుందాగా ఉండాలని జనసేనాని స్పష్టం చేశారు. వారు చేసిన తప్పులను, వారి అసభ్య ప్రసంగాలను పదేపదే జనాలలో ఎండగట్టడమే మన మొదటి కర్తవ్యం కావాలన్నారు.












Click it and Unblock the Notifications