రెచ్చగొడితే కఠిన చర్యలు-సంయమనం పాటించాలన్న డీజీపీ-అదనపు బలగాల మోహరింపు
ఏపీలో టీడీపీ నేత పట్టాభి సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యల్ని నిరసిస్తూ టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు దాడులు చేస్తున్న నేపథ్యంలో డీజీపీ గౌతం సవాంగ్ స్పందించారు. దాడులకు దిగుతున్న వారికి డీజీపీ కఠిన హెచ్చరికలు జారీ చేశారు. అదే సమయంలో ప్రజలు ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యల పట్ల అయినా సంయమనం పాటించాలని కోరారు.
టీడీపీ ఆఫీసులపై జరిగిన దాడులపై డీజీపీ కార్యాలయం ఇవాళ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో రెచ్చగొట్టే వ్యాఖ్యల పట్ల ప్రజలు ఆవేశకావేశాలకు గురికాకుండా సంయమనం పాటించాలని కోరారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ గౌతం సవాంగ్ హెచ్చరించారు. చట్టాన్ని ఎవరు తమ చేతిలోకి తీసుకోవద్దని ఆయన సూచించారు. చట్టాన్ని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు.

రాష్ట్రంలో టీడీపీ కార్యాలయాలపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ సవాంగ్ తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా అదనపు బలగాలను మోహరించినట్లు డీజీపీ వెల్లడించారు. ప్రజలందరూ శాంతిభద్రతల పరిరక్షణలో సంయమనం పాటిస్తూ సహకరించాలన్నారు. టీడీపీ ఆఫీసులపై దాడి ఘటనలో పోలీసుల పాత్రపై విమర్శలు వెల్లువెత్తుతువన్న నేపథ్యంలో డీజీపీ కార్యాలయం జారీ చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
వాస్తవానికి సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత పట్టాభి, అందులో డీజీపీ గౌతం సవాంగ్ ను ఉద్దేశించి కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లి ప్యాలెస్ చెప్పినట్లు వింటూ తమ నేతలకు నోటీసులు జారీ చేస్తున్నారని మండిపడ్డారు. అదే సమయంలో వైసీపీ నేతలకు నోటీసులు జారీ చేయాలంటూ ఇష్టారాజ్యంగా పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యలే ఇవాళ టీడీపీ కార్యాలయాలపై దాడులకు కారణమయ్యాయి. దీంతో ఇప్పుడు డీజీపీ టీడీపీ నేత పట్టాభి తరహాలో రెచ్చగొట్టేలా చేసే వ్యాఖ్యలకు స్పందించవద్దని ప్రజల్ని కోరారు.












Click it and Unblock the Notifications