ఏపీలో ఉద్యోగ నేతలపై తీవ్ర ఒత్తిడి-ఎన్నికల వేళ సమ్మె హెచ్చరికలు ! ఆ రాజీ ఎఫెక్ట్ ?
ఏపీలో దాదాపు అన్ని ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పుడు సమ్మెకు సిద్ధమవుతున్నారు. వచ్చే సంక్రాంతి తర్వాత సమ్మెకు సిద్ధం కావాలని ఉద్యోగులకు నేతలు సంకేతాలు ఇస్తున్నారు. వరుసగా సమావేశాలు పెట్టుకుంటూ వైసీపీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం, ఆక్రోశం, ఆవేదన వెళ్లగక్కుతున్నారు. అయితే ఈ దుస్దితి ఎందుకొచ్చిందన్న దానిపై వారి దగ్గర సమాధానం మాత్రం కనిపించడం లేదు. ఓవైపు ఎన్నికలకు సిద్దమవుతూ సమ్మెకు వారు పిలుపునివ్వడం వెనుక ఏం జరుగుతోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ?

ఉద్యోగులకు జగన్ హామీలు
ఏపీలో ఉద్యోగులకు వైసీపీ అధినేతగా పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్ చాలా హామీలు ఇచ్చారు. వీటిలో కీలకమైనవి మెరుగైన పీఆర్సీ, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ. వీటిలో ఏదీ అమలు కాలేదు. పీఆర్సీ వద్దకు వచ్చేసరికి ప్రభుత్వం నిధుల కొరత పేరుతో చేతులెత్తేసింది. దీనిపై ఎన్ని పోరాటాలు చేసినా ఫలితం లేకపోవడంతో ఉద్యోగ నేతలు ఇచ్చింది తీసుకుందామంటూ ఉద్యోగుల్ని ఒప్పించారు. అధికారంలోకి రాగానే వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామన్న జగన్.. మూడేళ్లయినా దాని మాటెత్తకపోవడంతో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. దీంతో సీపీఎస్ స్ధానంలో జీపీఎస్, ఓపీఎస్ అంటూ పలు ప్రతిపాదనలు చేసిన సర్కార్.. ఉద్యోగులు అవేవీ ఒప్పుకోకపోవడంతో చివరికి దీనిపై అవగాహన లేక హామీ ఇచ్చామంటూ తేల్చిచెప్పేసింది. అయినా ఉద్యోగులు ఇప్పటికీ పోరాటాలుచేస్తున్నారు. అయితే ప్రభుత్వం వారిని ఎక్కడికక్కడ అడ్డుకుంటోంది. మరోవైపు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ సమస్య కూడా అలాగే ఉంది. ఇది పెండింగ్ లో ఉండగానే తాము అట్టహాసంగా తీసుకొచ్చిన సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ తో పాటు రెగ్యులర్ ఉద్యోగుల తరహాలో వారికి అన్ని సదుపాయాల్ని కల్పిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం కూడా ఉద్యోగ నేతలకు చుట్టుకుంటోంది.

సర్కార్ తో ఉద్యోగ నేతల కుమ్మక్కు ?
గతంలో 11వ పీఆర్సీ సాధనతో పాటు ఆ తర్వాత జరిగిన పలు డిమాండ్ల సాధన సందర్భంగా ఉద్యోగసంఘాలంతా ప్రభుత్వం చెప్పినట్లు విని ఉద్యోగుల పొట్టకొట్టారన్న విమర్శలున్నాయి. ముఖ్యంగా తమ ప్రయోజనాలు కాపాడతారని గెలిపించిన ఉద్యోగనేతలు ప్రభుత్వంతో రాజీపడి పీఆర్సీ తక్కువగా ఇచ్చినా, సీపీఎస్ రద్దు చేయకపోయినా, కాంట్రాక్టు ఉద్యోగుల్ని క్రమబద్ధీకరించకపోయినా పట్టించుకోవడం లేదనే ఆక్రోశం ఉద్యోగుల్లో కనిపిస్తోంది. దీంతో ఉద్యోగసంఘాల నేతల్ని ప్రశ్నించి ప్రశ్నించి విసిగిపోయిన ఉద్యోగులు తమకు టైం వచ్చినప్పుడు సత్తా చూపిద్దామనే భావనలో కనిపిస్తున్నారు.

రానే వచ్చిన సమయం
తాము గతంలో గెలిపించిన ఉద్యోగసంఘాల నేతలు తమ ప్రయోజనాల కోసం పనిచేయకుండా ప్రభుత్వం చెప్పినట్లు విని తమకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహంగా ఉన్న ఉద్యోగులకు వారు నిరీక్షిస్తున్న సమయం రానే వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో అతిపెద్ద ఉద్యోగ ఎన్నికలుగా చెప్పుకునే ఏపీ ఎన్జీవో ఎన్నికలతో పాటు సచివాలయ ఉద్యోగ సంఘం ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. వీటిలో ఉద్యోగసంఘాల నేతలైన బండిశ్రీనివాసరావు, కాకర్ల వెంకట్రామిరెడ్డి భవిష్యత్తు తేలిపోనుంది. దీంతో ఈ ఎన్నికల్లో వీరిద్దరినీ గద్దె దింపి సమర్దంగా తమ డిమాండ్లు వినిపించే నేతల్ని ఎన్నుకునేందుకు ఉద్యోగులు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో ఏపీ జేఏసీ అమరావతి కూడా కర్నూల్లో వచ్చే నెలలో జరిగే సభ ద్వారా తాడోపేడో తేల్చుకునేందుకు ప్రయత్నిస్తోంది.

సమ్మె హెచ్చరికల వెనుక ?
ఉద్యోగులు ఓట్లేస్తే ఎన్నికైన నేతలు వారి ప్రయోజనాల కోసం పనిచేయకుండా ప్రభుత్వం చెప్పినట్లు విని పనిచేస్తున్నారన్న ఆక్రోసం సర్వత్రా కనిపిస్తోంది. దీంతో ఉద్యోగులు ప్రస్తుతం ఉద్యోగసంఘాల్ని నడుపుతున్న కీలక నేతలకు చెక్ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో తాము ప్రభుత్వానికి అనుకూలం కాదని, ఉద్యోగులవైపే ఉన్నామని నిరూపించుకోవాల్సిన పరిస్దితి వీరికి తలెత్తుతోంది. దీంతో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న డిమాండ్ల సాధన కోసం సంక్రాంతి తర్వాత సమ్మెకు వారు హెచ్చరికలు పంపుతున్నారు. సంక్రాంతి వరకూ ప్రభుత్వానికి డెడ్ లైన్లు ఇచ్చామని, ఇందులో విఫలమైతే సమ్మె తప్పదంటున్నారు. తద్వారా ఉద్యోగ నేతలు తమ చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఉద్యోగులు వీరిని ఎంతమేరకు నమ్ముతారో చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications