AP Employees: ఉద్యోగుల తాజా వార్నింగ్..! 28న విజయవాడలో తాడో పేడో..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా ఉద్యోగుల (AP Employees) సమస్యల పరిష్కారం కాకపోవడం వారిలో ఆందోళన పెంచుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలపైనా ఒత్తిడి పెరుగుతోంది. దీంతో ఏదో ఒకటి చేయాల్సిన పరిస్ధితుల్లో ఉద్యోగ సంఘాలతో కూడిన ఏపీ జేఏసీ అమరావతి నేతలు ఇవాళ మరోసారి ప్రభుత్వానికి స్పష్టమైన హెచ్చరికలు చేశారు. తమ డిమాండ్ల పరిష్కారం విషయంలో చర్యలు తీసుకోకపోతే ఈ నెల 28న విజయవాడలో జరిగే రాష్ట్ర స్దాయి భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని,కూటమి మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని ఏపీ జేఏసీ నేతలు ఇవాళ ప్రభుత్వాన్ని కోరారు. చర్చల పై నిర్ణయాల కాలయాపనకు స్వస్తి చెప్పాలన్నారు. ఉద్యోగుల సహనాన్ని బలహీనతగా భావించవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉద్యోగుల హక్కులు కోసం పోరాడుతూనే ఉంటామన్నారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తమ హక్కు అని వారు తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఐక్యంగా నిలవాలని నేతలు కోరారు.

ఈనెల 28న విజయవాడలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించాలని జేఏసీ నిర్ణయించింది. 28న భవిష్యత్ ఉద్యమ కార్యాచరణపై కీలక నిర్ణయం తీసుకుంటామన్నారు.డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయి ఉద్యోగ సంఘ నాయకులందరూ 28న సదస్సుకు తరలిరావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలన్నారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఏపీ NGGO జేఏసి, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మరియు ఇతర ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలన్నీ ఐక్య ఉద్యమానికి కలిసి రావాలని కోరారు. ఐక్యంగా పోరాడి సమస్యలు సాధించుకోవడంతో పాటు ఉద్యోగుల ఆత్మగౌరవం కూడా కాపాడుకుందామని నేతలు పిలుపునిచ్చారు.













Click it and Unblock the Notifications