మూడు నెలల్లో కూటమి ప్రభుత్వం చేసిన అప్పుల లెక్కలిలా..!!
ఏపీలో కూటమి పాలనలో ఆర్దిక పరిస్థితి ఎలా ఉంది. ఎన్నికల సమయంలో వైసీపీ హాయంలో చేసిన అప్పులను కూటమి నేతలు ప్రధానంగా ప్రచారం చేసారు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధాన రంగాల పైన శ్వేత పత్రాలను విడుదల చేసారు. ఆర్దికంగా రాష్ట్రం కష్టాల్లో ఉందని ప్రతీ సందర్భంలోనూ చెబుతున్నారు. దీంతో..కూటమి ప్రభుత్వ ఆర్దిక నిర్వహణ పైన చర్చ మొదలైంది. కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన నాలుగు నెలల కాలంలో చేసిన అప్పు రూ 43 వేల కోట్లకు చేరింది.
నాలుగు నెలల్లో రూ 43 వేల కోట్లు
జూన్ 12న కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఈ నాలుగు నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం 43 వేల కోట్ల రూపాయలకు పైగా అప్పు చేసింది. ద్రవ్య, ఆదాయ లోటు కూడా భారీగానే రికార్డయింది. ఈ మేరకు ప్రధాన గణాంకాధికారి కార్యాలయం తాజాగా నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం అప్పులు కాకుండా, పన్నులు, ఇతర ఆదాయ మార్గాల ద్వారా ఏప్రిల్ నుంచి జులై వరకు రూ.44,822 కోట్లు ఖజానాకు చేరింది. ఇందులో జిఎస్‌టి, భూములపై ఆదాయం, పన్నులు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా, కేంద్రం ఇచ్చిన గ్రారట్లు వంటివి కలిపి రూ.41 వేల కోట్ల వరకు ఉంది.

పెరుగుతున్న అప్పులు
రాష్ట్ర అవసరాలకు ఆ మొత్తం చాలకపోవడంతో రుణాల ద్వారా రూ.43,058 కోట్లు సమకుర్చుకున్నారు. నెలకు దాదాపు 11 వేల కోట్ల రూపాయల మేర అప్పులు చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. అయితే, రూ.87,282 కోట్లు మేర ఖర్చులయ్యాయి. ఆదాయానికి, వ్యయానికి మధ్య అంతరాన్ని రుణాలతోనే భర్తీ చేయాల్సి వచ్చిందని నివేదికలో పేర్కొన్నారు. ఈ అంతరం కారణంగానే లోటు కూడా గణనీయంగా నమోదైనట్లు తేలింది. ఆదాయ లోటు ఏకంగా 137.59 శాతంతో రూ.40,234 కోట్లుగా రికార్డుకాగా, ద్రవ్యలోటు కూడా 83.92 శాతంతో రూ.42,580 కోట్లకు చేరుకున్నట్లు తేలింది.
రెవిన్యూ వ్యయం
మొత్తం ఖర్చు రూ.87,282 కోట్లలో రెవెన్యూ వ్యయమే ఏకంగా రూ.85,056 కోట్ల వరకు ఉండడం గమనార్హం. అలాగే మొత్తం వ్యయంలో సేవా రంగానికే రూ.49 వేలకోట్ల వరకు ఖర్చు చేయడంతో మిగిలిన కొద్దిపాటి రూ.2,226 కోట్లను మాత్రమే పెట్టుబడి వ్యయానికి వెచ్చించాల్సి వచ్చిందని నివేదికలో పేర్కొన్నారు. ఇక ప్రభుత్వం పైన తాజా వరదలతో రెవిన్యూ వసూళ్ల పైన ప్రభావం పడింది. పథకాల నిర్వహణ పైన ఒత్తిడి పెరుగుతోంది. దీంతో, ప్రభుత్వం ఓట్ ఆన్ ఎకౌంట్ ను మాత్రమే ప్రవేశ పెట్టింది. వచ్చే నెలలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు కసరత్తు జరుగుతోంది.












Click it and Unblock the Notifications