ఏపీలో ఇకపై రేషన్ పంపిణీ ఇలా.. డీలర్లకు ప్రభుత్వం సూచనలు..!
ఏపీలో రేషన్ పంపిణీ స్వరూపం మారబోతోంది. ఇప్పటివరకూ రేషన్ వాహనాల ద్వారా పంపిణీ చేస్తున్న సరుకుల్ని ఇకపై పాత విధానంలో రేషన్ షాపుల ద్వానే పంపిణీ చేయబోతున్నారు. జూన్ 1 నుంచి కొత్త విధానం అమల్లోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. అలాగే రేషన్ డీలర్లకు కూడా రేషన్ ఎలా పంపిణీ చేయాలో ప్రభుత్వం పలు సూచనలు చేస్తోంది.
ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు ప్రభుత్వం రేషన్ దుకాణల ద్వారా సరుకుల పంపిణీ చేపడుతుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇవాళ పేర్కొన్నారు.విజయవాడలో ఇవాళ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా సరఫరా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రేషన్ పంపిణీపై సమీక్ష నిర్వహించారు.కూటమి ప్రభుత్వ నిర్ణయం మేరకు జూన్ 1 నుంచి డీలర్లు రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసరాలు పంపిణీకి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

చంద్రబాబు, పవన్ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చేలా రేషన్ డీలర్లు పనిచేయాలని మంత్రి సూచించారు. గతంలో కార్డుదారుల కుటుంబాలకు కుటుంబ పెద్దలా ఉన్న రేషన్ డీలర్లు అదేవిధంగా ఇప్పుడు కూడా మనసు పెట్టి పనిచేసి కార్డుదారులకు గౌరవంగా సేవలందించాలన్నారు. రేషన్ దుకాణాల పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూడటం, సరైన కొలతలతో సరుకులు పంపిణీ చేయడం, ధరలు, స్టాక్ బోర్డు మరియు పోస్టర్లు ఏర్పాటు చేయాలన్నారు.
ప్రతి రేషన్ డీలర్ వారికి కేటాయించిన ఈపోస్ మిషన్, బరువు స్కేల్ మిషన్ పనితీరును పరిశీలించుకోవాలన్నారు. దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటివద్దే రేషన్ సరుకులు పంపిణీ చేయాలన్నారు. ప్రతినెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆదివారాల్లో సైతం సరుకులు పంపిణీ పూర్తి చేయాలన్నారు.ప్రతి నెల ఒకటో తేదీ నుంచి అయిదో తేదీలోపే దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడి వృద్ధులకు ఇంటివద్దే రేషన్ సరుకులు పంపిణీ చేసేందుకు చొరవచూపాలన్నారు.
వాట్సాప్ గ్రూపు ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ కార్డుదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఒకవేళ ఎప్పుడైనా సాంకేతిక సమస్యలు ఎదురైనాసరే కార్డుదారులకు ఇబ్బందిలేకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సరుకుల పంపిణీ జరగాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ-పోస్, వెయింగ్ మెషీన్ల రిపేర్లకు సంబంధించి సర్వీసు క్యాంపులు ప్రతి జిల్లాకు ఏర్పాటు చేస్తామన్నారు. వీటిని సద్వినియోగం చేసుకుంటూ రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీకి సర్వసన్నద్ధంగా ఉండాలని మంత్రి సూచించారు.












Click it and Unblock the Notifications