ఆస్తిపన్ను చెల్లింపు దారులకు ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్..
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా ఆస్తిపన్ను బకాయిలు ఉన్నవారికి ప్రయోజనం కల్పించేలా ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. దీని ప్రకారం ఇప్పటివరకూ ఆస్తిపన్ను చెల్లించకుండా బకాయి ఉన్న వారికి ప్రయోజనం చేకూరబోతోంది. ఈ నెల 31తో ముగుస్తున్న 2023-24 ఆర్ధిక సంవత్సరం వరకూ ఆస్తిపన్ను బకాయిలు ఉన్న వారికి ఇది వర్తిస్తుంది.
ఏపీలో ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో ఆస్తిపన్ను ఇంకా చెల్లించని వారికి ప్రభుత్వం ఓ ఆఫర్ ఇచ్చింది. ఇప్పటివరకూ వారి ఆస్తిపన్నుపై విధించిన వడ్డీని మినహాయిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అంటే వడ్డీ మినహాయించుకుని వాస్తవ ఆస్తిపన్నును వారు చెల్లిస్తే సరిపోతుంది. తద్వారా ఇప్పటివరకూ ఆస్తిపన్ను చెల్లించకుండా వడ్డీ పెనాల్టీ పడిన వారందరికీ ప్రయోజనం చేకూరబోతోంది. ఈ ఆర్ధిక సంవత్సరం మరో రెండు వారాల్లో ముగియనున్న నేపథ్యంలో ఆస్తిపన్ను వసూళ్లు వేగవంతం చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

గతంలోనూ ఆస్తిపన్ను వసూళ్లకు సంబంధించి పలుమార్లు ప్రభుత్వం మినహాయింపులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయినా ఇంకా చెల్లించని వారు కూడా ఉన్నారు. అలాగే ఇళ్లకు ఆస్తిపన్ను అసెస్ మెంట్ కూడా చేయించుకోకుండా వాటిలో నివసిస్తున్న వారు కూడా ఉన్నారు. వారి నుంచి వసూళ్లు చేపట్టేలా అధికారులకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూనే ఉంది. ఇప్పటికే వడ్డీతో సహా ఆస్తిపన్ను బకాయి చెల్లించిన వారు ఉంటే వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటికే చెల్లించిన వడ్డీని సర్దుబాటు చేస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. ఇలా చెల్లించిన వారికి నేరుగా రిఫండ్ మాత్రం రాదని తెలిపింది.












Click it and Unblock the Notifications