ఎవరితో పెట్టుకోకూడదో వారి తోనే మోదీ పెట్టుకున్నారు..!!
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు మొత్తం బీఆర్ఎస్ పార్టీ విద్యార్థులకు సంఘీభావంగా వచ్చిందని, ఈ విషయంలో ఎలాంటి రాజకీయం లేదని కేటీఆర్ అన్నారు. ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై పెట్టిన కేసులు వెంటనే ఉప సంహరించాలన్నారు. మోదీ ప్రభుత్వంపై కొట్లాడేందుకు తాము వస్తుంటే ఇక్కడ చోటాభాయ్ కు ఎందుకు కోపమని కేటీఆర్ ప్రశ్నించారు.
రాజకీయ అజెండాలతో యువత పోరాటాన్ని మలినం చేయవద్దని కేటీఆర్ హితవు పలికారు. విద్యార్థులకు న్యాయం జరగాలని సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష చేపట్టారని గుర్తు చేసారు. జవాబుదారీతనం, విద్యా విధానంలో సంస్కరణలు చేపట్టాలని కోరుతూ ఆయన నిరసన చేపట్టారని కేటీఆర్ వివరించారు. దిల్లీలో ఇంత జరుగుతుంటే సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ వెళ్లి దాక్కున్నారని కేటీఆర్ విమర్శించారు. దేశం అంతటా మోదీ, ధర్మేంద్ర ప్రధాన్‌ను ప్రశ్నిస్తుంటే రేవంత్ రెడ్డి ఇక్కడ కేసీఆర్, కేసీఆర్ అని అంటున్నారని ఎద్దేవా చేశారు. మోదీ ఎవరితో పెట్టుకో కూడదే వారితో జెన్ జీతూ పెట్టుకున్నారని.. జాగ్రత్త పడాలని హెచ్చరించారు. నేపాల్, శ్రీలంక లో యువత ఏం చేసిందో గుర్తుంచుకోవాలని సూచించారు. యువత ఉడుత ఊపులు, ఐటీ, సీబీఐ, ఈడీకి భయపడదని చెప్పారు.

విద్యార్దుల పోరాటానికి పార్టీ మద్దతుగా నిలుస్తుంది
యువత జవాబుదారీతనం కోరుతోందని.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. యువతపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని పేర్కొన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ.. మేక్ ఇన్ ఇండియా అడిగితే లీక్ ఇన్ ఇండియా ఇచ్చారంటూ సెటైర్లు వేశారు. న్యాయం చేయాలని విద్యార్థులు అడుగుతున్నారని, వారికి అండగా నిలబడతామని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఢిల్లీలో మోదీ ఇంటి ముందు రాహుల్ గాంధీ ధర్నా చేస్తే రేవంత్ ఎక్కడ ఉన్నారని కేటీఆర్ ప్రశ్నించారు. నీట్ పేపర్ లీక్‌పై ఆయన ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నలు సంధించారు. విద్యార్థులను కొడుతుంటే సీఎం ఎందుకు మౌనంగా ఉన్నారన్నారు. రేవంత్ రెడ్డికి నిద్రలో కూడా కేసీఆరే గుర్తు వస్తున్నారని కేటీఆర్ చురకలు అంటించారు. నీట్ విద్యార్థులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని కేటీఆర్ ప్రకటించారు.


Click it and Unblock the Notifications