ఏపీలో ఇంటర్ అడ్మిషన్లు ఆన్ లైన్లోనే- నేరుగా తీసుకుంటే చెల్లవన్న సర్కార్
ఏపీలో ఇంటర్ మీడియట్ అడ్మిషన్ల ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. అయితే ఇప్పటికే పలు కళాశాలలు నేరుగా అడ్మిషన్లు ఇచ్చేస్తున్నాయి. ఇవి చెల్లవని ఇవాళ ఇంటర్ మీడియట్ బోర్డు ప్రకటించింది. కేవలం ఆన్ లైన్ ద్వారా తీసుకునే అడ్మిషన్లు మాత్రమే చెల్లుబాటు అవుతాయని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లను ఆన్‌లైన్ ద్వారానే నిర్వహిస్తున్నట్లు ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శి రామకృష్ణ వెల్లడించారు. ఇంటర్ అడ్మిషన్లను ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నామన్న ఆయన.. ఆఫ్‌లైన్‌లో అడ్మిషన్లను తీసుకోవద్దని తల్లిదండ్రులను కోరారు.
ఇంటర్ మీడియట్ అడ్మిషన్లు కోరుకునే విద్యార్ధులు ఆన్‌లైన్ ద్వారానే పొందాలని ప్రభుత్వం సూచించింది. ఇప్పటిదాకా అడ్మిషన్ల విషయంలో ఎటువంటి నోటిఫికేషన్ జారీ చేయలేదని, అయితే ఇప్పటికే కొన్ని కాలేజీలు ఆఫ్‌లైన్ ద్వారా అడ్మిషన్లను చేపట్టాయి. వాటిని ఇంటర్ బోర్డు పరిగణలోకి తీసుకోదని ఇంటర్ బోర్డు కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. తల్లిదండ్రులు ప్రైవేట్ కాలేజీలలో ఆఫ్‌లైన్ అడ్మిషన్లు పిల్లలకు తీసుకుంటే నష్టపోతారని హెచ్చరించారు.

Apbie.gov.in ద్వారా గుర్తింపు పొందిన కాలేజీలలో మాత్రమే అడ్మిషన్లు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.. బోర్డు అనుమతి లేకుండా అడ్మిషన్లు చేపట్టిన కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
కరోనా కారణంగా ఏపీలో విద్యాసంవత్సరం ఇంకా ప్రారంభం కాలేదు. ఇప్పటికే స్కూళ్లను ఆగస్టు 16 నుంచి పునఃప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 12 నుంచి ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్ధులకు ఆన్ లైన్ క్లాసులు కొనసాగిస్తున్నారు. అలాగే ఇంటర్ సెకండియర్ 2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక ఆకడిమిక్ క్యాలెండర్‌ను కూడా సిద్దం చేశారు.












Click it and Unblock the Notifications