జగన్ సర్కార్ ను వీడని జీవో వెబ్ సైట్ వివాదం-ఎందుకు మార్చారని హైకోర్టు ప్రశ్న
ఏపీ ప్రభుత్వం గతంలో ఉన్న ఏపీజీవోఐఆర్ వెబ్ సైట్ స్దానంలో ప్రభుత్వ ఉత్తర్వుల విడుదల కోసం కొత్త వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొన్ని రోజుల పాటు పాత వెబ్ సైట్ ను నిలిపేసిన ప్రభుత్వం.. ఆ తర్వాత ముప్పేట దాడితో తిరిగి కొత్త వెబ్ సైట్ ను ప్రారంభించింది. దీనిపైనా హైకోర్టులో ప్రభుత్వం ఇరుకునపడక తప్పడం లేదు.
ఏపీజీవోఐఆర్ వెబ్ సైట్ స్ధానంలో ఈ-గెజిట్ వెబ్ సైట్ తీసుకురావడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన ఆంజనేయులు అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఈ సందర్భంగా హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు కూడా సంధించింది. దీంతో ప్రభుత్వం జీవోల వెబ్ సైట్ విషయంలో మరోసారి ఇరుకునపడింది. దీనిపై ప్రభుత్వం వద్ద సరైన వివరణ లేకపోవడంతో తదుపరి విచారణలో వివరాలు ఇవ్వాలని హైకోర్టు సూచించింది.

ఏపీ ప్రభుత్వం జీవోల్ని ఈ-గెజిట్ వెబ్ సైట్ లో వారానికోసారి పెడతామని చెప్పడాన్ని పిటిషనర్లు హైకోర్టులో సవాల్ చేశారు. అలాగే కాన్ఫిడెన్షియల్ పేరుతో జీవోలు దాచిపెట్టడం చట్ట వ్యతిరేకమని కూడా వాదించారు. ఇది సమాచార హక్కు చట్టానికి కూడా విరుద్దమన్నారు. దీంతో హైకోర్టు స్పందించింది. జీవోల జారీ, వాటిని బహిరంగ పరిచే విషయంలో కొత్త విధానం తీసుకురావడం వెనుక కారణాల్ని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వెంటనే ప్రభుత్వం వద్ద సమాధానం లేకపోవడంతో వచ్చే నెలలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించిన హైకోర్టు.. కేసును కూడా ఆరోజుకే వాయిదా వేసింది.
ఏపీ ప్రభుత్వం జారీ చేస్తున్న పలు జీవోలు వివాదాస్పదం కావడం, కాన్ఫిడెన్షియల్ పేరుతో పలు రహస్య జీవోలు కూడా ఇస్తుండటంతో దీనిపై విమర్శలు వచ్చాయి. విపక్షాలతో పాటు సాధారణ ప్రజలు సైతం జీవోల్ని ప్రభుత్వం విడుదల చేయకుండా దాచిపెట్టడమేంటన్న విమర్శలు చేస్తుున్నారు. దీంతో ప్రభుత్వం ఏకంగా జీవోఐఆర్ వెబ్ సైట్ ద్వారా జీవోల విడుదలనే నిలిపేస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీనిపై హైకోర్టులో కేసులు దాఖలుకావడంతో దాని స్ధానంలో మరో వెబ్ సైట్ తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఈ-గెజిట్ వెబ్ సైట్ తెరపైకి వచ్చింది. ఇప్పుడు దానిపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం హైకోర్టుకు ఏం చెప్పబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications