ఏపీ హైకోర్టు జడ్డీలపై సోషల్ మీడియా పోస్టుల కేసు విచారణ-సీబీఐ కీలక రిపోర్టులు
ఏపీలో హైకోర్టు జడ్డీలు, వారి తీర్పులను తప్పుబడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తులో సీబీఐ పురోగతి సాధించింది. ఇప్పటివరకూ నిందితులకు సంబంధించిన కీలక ఆధారాలతో సీబీఐ హైకోర్టుకు మూడు నివేదికలు సమర్పించింది. ఇవాళ ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు వీటిని పరిశీలించింది.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైకోర్టు ఇచ్చిన పలు తీర్పులపై సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు వెలిశాయి. ఫేస్ బుక్, ట్విట్టర్ తో పాటు బహిరంగంగా కూడా పలు బ్యానర్లు దర్సనమిచ్చాయి. వీటిపై దాఖలైన ఓ పిటిషన్ విచారణ సందర్భంగా ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. సీఐడీ విచారణకు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఆ తర్వాత సీఐడీ దర్యాప్తుపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు... ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించింది. దీంతో దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ కీలక ఆధారాలు సేకరించింది.

Recommended Video
గతేడాది వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో వెలువడిన తీర్పులపై వైసీపీ నేతలు, సానుభూతిపరులు సోషల్ మిడియాలో పోస్టులు పెట్టారు. వాటిపై గుంటూరుకు చెందిన లక్ష్మీనారాయణ అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ కేసు సీబీఐకి చేరింది. దర్యాప్తులో భాగంగా ఈ పోస్టులు పెట్టిన వారికి సంబంధించిన కీలక సమాచారాన్ని సీబీఐ సేకరించింది. ఇందులో పలువురిని విశాఖలోని సీబీఐ కార్యాలయానికి రప్పించి విచారించారు. మరికొందరిని విజయవాడలో విచారించినట్లు తెలుస్తోంది. దీనిపై మూడు నివేదికలను సీబీఐ హైకోర్టుకు సమర్పించింది. అయితే మరిన్ని ఆధారాల కోసం దర్యాప్తు కొనసాగించాల్సి ఉందని, దీనికి మరో మూడు నెలలు సమయం పడుతుందని సీబీఐ హైకోర్టుకు తెలిపింది. దీంతో కేసు విచారణను ముూడు నెలలు వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications