కరెంట్ పోతే వెంటనే ఈ నెంబర్ కు కాల్ చేయండి..
రాష్ట్రంలో ఎక్కడా ఉద్దేశపూర్వక విద్యుత్ కోతలు లేవని, వాతావరణంలో వస్తున్న తీవ్ర మార్పుల వల్లే కొన్ని చోట్ల సాంకేతిక అంతరాయాలు తలెత్తుతున్నాయని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యుత్ సమస్యల తక్షణ పరిష్కారానికి, ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు '1912' టోల్ ఫ్రీ నెంబర్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించారు. పగటిపూట 48 డిగ్రీలకు పైగా నమోదవుతున్న రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, సాయంత్రం వేళల్లో వీస్తున్న ఈదురుగాలుల కారణంగానే పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు ఆటంకాలు ఎదురవుతున్నాయని, ఈ క్లిష్ట పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
ప్రాణాలు పణంగా పెట్టి సిబ్బంది శ్రమ..
తీవ్రమైన ఎండలు, ఉష్ణోగ్రతల వల్ల రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందని మంత్రి తెలిపారు. "రాష్ట్ర అవసరాలకు సరిపడా విద్యుత్ అందుబాటులో ఉన్నప్పటికీ.. విపరీతమైన వేడి వల్ల ట్రాన్స్మిషన్ (సరఫరా) సమస్యలు వస్తున్నాయి. ఎక్కడైనా ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోతే, దాని స్థానంలో యుద్ధప్రాతిపదికన కొత్తది ఏర్పాటు చేసి విద్యుత్‌ను పునరుద్ధరించడానికి కనీసం 2 నుండి 4 గంటల సమయం పడుతుంది" అని ఆయన వివరించారు.
ఈ కఠినమైన పరిస్థితుల్లోనూ విద్యుత్ శాఖ సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి నిరంతరం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని కొనియాడారు. ఇటీవల సత్తెనపల్లిలో ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతులు చేస్తూ ఇద్దరు సిబ్బంది ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఉదంతాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు.

హోర్డింగులపై మున్సిపల్ శాఖతో సమన్వయం:
సాయంత్రం వేళల్లో వీచే బలమైన ఈదురుగాలులకు అనుమతులు లేని భారీ హోర్డింగులు, ఫ్లెక్సీలు తెగి విద్యుత్ తీగలపై పడటం వల్ల కూడా లైన్లు బ్రేక్ అవుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఇలాంటి ప్రమాదకరమైన, అనధికారిక హోర్డింగులను పూర్తిగా తొలగించేందుకు మున్సిపల్ శాఖతో సమన్వయం చేసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.
వైసీపీ హయాంలో ఒక్క సబ్‌స్టేషన్ కూడా కట్టలేదు!
గత వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై మంత్రి గొట్టిపాటి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ఐదేళ్ల పాలనలో జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో కనీసం ఒక్క సబ్‌స్టేషన్‌ను కూడా నిర్మించకుండా విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా పెద్ద ఎత్తున సబ్‌స్టేషన్ల నిర్మాణ పనులను చేపట్టిందని తెలిపారు.
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సబ్‌స్టేషన్ల పనులన్నీ పూర్తయితే విద్యుత్ అంతరాయాల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే సెప్టెంబర్ నాటికే రాష్ట్రవ్యాప్తంగా 30 కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు.














Click it and Unblock the Notifications