నాలుగేళ్లుగా చితికిపోయిన వైసీపీ క్యాడర్ ? మంత్రి ధర్మాన షాకింగ్ కామెంట్స్..
ఏపీలో వైసీపీ తొలిసారి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయ్యాయి. మరో తొమ్మిది నెలల్లో మరోసారి సార్వత్రిక ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు వైసీపీ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ నాలుగేళ్లలో వైసీపీ కార్యకర్తలు, నేతలు ఆర్ధికంగా సంపాదించుకున్నారని అంతా అనుకుంటున్నారనో, లేక మరో కారణమో తెలియదు కానీ ఇవాళ వారి గురించి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ మధ్య కాలంలో వరుసగా తన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్న ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇవాళ మరోసారి శ్రీకాకుళంలో అలాంటి వ్యాఖ్యలే చేశారు. సొంత పార్టీకి కూడా ఇబ్బందులు కలగజేసేలా ఉంటున్న ఆయన వ్యాఖ్యలు ఇవాళ మరోసారి అదే తరహాలో ఉన్నాయి. గత నాలుగేళ్లలో వైసీపీ కార్యకర్తలు ఆర్థికంగా బాగా చితికిపోయారని ధర్మాన తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు స్థానిక నేతలు, కార్యకర్తలు ఎంతో ఖర్చు చేస్తున్నారని, వారికి పైసా లబ్ధి కూడా చేకూరలేదని చెప్పారు.

ఎక్కడి నుంచో వస్తున్న డబ్బులతో వైసీపీ క్యాడర్ స్థానికంగా మీటింగ్ లు పెట్టడం లేదని, కార్యకర్తల చేతి చమురు వదులుతోందని ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. ప్రజలకు మంచి చేయాలనే ఏకైక లక్ష్యంతో తమ ప్రభుత్వం పని చేస్తోందని ధర్మాన చెప్పారు. అవినీతికి తావు లేకుండా అన్ని పథకాలు లబ్ధిదారుల ఇంటికే నేరుగా చేరుతున్నాయన్నారు. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు ప్రజలను బెదిరించేవని రెవెన్యూ మంత్రి విమర్శించారు.
వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుని తన కుమారుడు మనోహర్ నాయుడికి టికెట్ ఇప్పించుకునేందుకు ధర్మాన ప్రసాదరావు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో తన సోదరుడు కృష్ణదాస్ కుమారుడు కూడా ఈ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరుణంలో ధర్మాన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తాజాగా ప్రకటన కూడా చేశారు. అనంతరం ఇలా సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు.












Click it and Unblock the Notifications