అమరావతి పనుల ఆలస్యం వెనుక వైసీపీ ? మంత్రి నారాయణ షాకింగ్..
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరునెలలు కావస్తోంది. అయినా ఇంకా అమరావతి రాజధాని పనులు మాత్రం మొదలు కాలేదు. ఇదిగో, అదిగో అంటూ ఆరునెలల కాలం గడిపేసిన కూటమి సర్కార్ ఇప్పుడు ఈ ఆలస్యం వెనుక వైసీపీ ఉందంటూ చావు కబురు చల్లగా చెబుతోంది. ఇవాళ అమరావతిలోని నీరుకొండలో పర్యటించిన మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈ విషయం చెప్పారు.
నీరుకొండ లో ఎంజీఆర్ ట్రస్ట్ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన పురపాలన మంత్రి నారాయణ ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని రైతుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం అమరావతిని నాశనం చేయాలని ఆర్ 5 జోన్ తీసుకొచ్చిందని నారాయణ ఆరోపించారు. ఆర్5 జోన్ లో పట్టాలు ఇచ్చిన పేదలకు గుంటూరు,ఎన్టీఆర్ జిల్లాల్లో స్థలాలు కేటాయిస్తామని తెలిపారు.

సుప్రీంకోర్టు లో అమరావతి రాజధానిపై ఉన్న కేసులు పరిష్కరించేలా ముందుకెళ్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు.గత ప్రభుత్వం పాత కాంట్రాక్ట్ లు రద్దు చేయకపోవడం తో ఆరు నెలలు వృధా అయిందన్నారు. లేదంటే అమరావతి పనులు ఎప్పుడో ప్రారంభం అయ్యేవన్నారు. మరో 9 నెలల్లో అధికారులకు అమరావతిలో నివాసాలు అందుబాటులోకి తెస్తామని నారాయణ వెల్లడించారు.
గతంలో చెప్పిన విధంగానే రాజధానిని తూచా తప్పకుండా పూర్తి చేస్తామన్నారు. మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడించారు. అలాగే నీరు కొండ లో భారీ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే 20 వేల కోట్ల పనులకు టెండర్లకు అధారిటీ ఆమోదం తెలిపిందని, నాలుగైదు రోజుల్లో టెండర్ల ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలిపారు.












Click it and Unblock the Notifications