జగన్ తీసుకుంటే మేం కట్టాలా ? సుప్రీంలో ఇసుక సంస్ధ షాకింగ్..!
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక తవ్వకాలు చేపట్టి అక్రమాలకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న జేపీ వెంచర్స్ సంస్ధకు జాతీయ హరిత ట్రైబ్యునల్ రూ.18 కోట్ల జరిమానా విధించింది. దీన్ని జేపీ వెంచర్స్ సంస్ద చెల్లించాల్సి ఉండగా.. అనూహ్యంగా సుప్రీంకోర్టులో ప్లేటు తిప్పేసింది. దీన్ని అప్పట్లో ఇసుక తవ్వకాలకు అనుమతులు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని, ఈ మేరకు తమకు ఊరటనివ్వాలని సుప్రీంకోర్టును కోరడం చర్చనీయాంశంగా మారింది.
గతంలో చిత్తూరు జిల్లాలోని ఆరణీయార్ నదీ పరీవాహక ప్రాంతాల్లో బి-2 కేటగిరీలో ఉన్న 18 రీచ్‌లలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపినందుకు జేపీ వెంచర్స్‌కు ఎన్జీటీ రూ.18కోట్లు జరిమానా విధించింది. ఈ మేరకు ఎన్జీటీ ఇచ్చిన తీర్పును జేపీ వెంచర్స్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కూడా ఆ జరిమానా తమకు జమ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జేపీ వెంచర్స్ మరో పిటిషన్ దాఖలు చేసింది.

అప్పట్లో జగన్ సర్కార్ కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు తీసుకుందని, దీని ప్రకారం తాము తవ్వకాలు మాత్రమే చేపట్టినట్లు తెలిపింది. కాబట్టి ఎన్జీటీ విధించిన జరిమానా కూడా ప్రభుత్వమే చెల్లించాలని, తాము దీన్ని చెల్లించబోమని సుప్రీంకోర్టుకు తెలిపింది. దీంతో సుప్రీంకోర్టు కూడా ఆలోచనలో పడింది. చివరికి ఈ వ్యవహారంపై సమాధానం ఇవ్వాలని కోరుతూ ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అలాగే తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. అయితే జేపీ వెంచర్స్ వాదనపై ప్రభుత్వం ఏం చెప్పబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.

ఎందుకంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జేపీ వెంచర్స్ కు ఇసుక తవ్వకాల అనుమతులు ఇవ్వడం, వాటిలో అక్రమాలలపై కూటమి పార్టీలు తీవ్రంగా పోరాటం చేశాయి. అలాగే అధికారంలోకి వచ్చాక సుప్రీంకోర్టులోనూ కూటమి సర్కార్ బలంగా వాదనలు వినిపిస్తోంది. ఇలాంటి తరుణంలో జరిమానా తాము కట్టేందుకు ఎలాగో ప్రభుత్వం సిద్ధంగా ఉండదు. కాబట్టి తదుపరి విచారణపై ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications