AP Schools: ఏపీలో తెరుచుకున్న స్కూళ్లు-విద్యాకానుక కిట్ల పంపిణీ..!
ఏపీలో దాదాపు రెండు నెలల వేసవి సెలవుల తర్వాత ఇవాళ పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. దీంతో విద్యార్ధులు భారీ సంఖ్యలో స్కూళ్లకు హాజరవుతున్నారు. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే అధికారుల నుంచి పాఠశాలలకు ఆదేశాలు అందాయి. ఇందులో భాగంగా విద్యా కానుక కిట్లను ఎప్పటిలాగే విద్యా సంవత్సరం ప్రారంభం రోజే అందజేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు వాస్తవానికి నిన్నే పునఃప్రారంభం కావాల్సి ఉంది. అయితే కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకారం నేపథ్యంలో ఒక రోజు ఆలస్యంగా స్కూళ్లను ప్రారంభించాలని విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో ప్రభుత్వం ఇవాళ్టి నుంచి స్కూల్స్ తెరవాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో ఇవాళ స్కూళ్లను పునఃప్రారంభించారు. కొన్నేళ్లుగా కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం రోజే విద్యా కానుక కిట్లు అందజేస్తుండటంతో ఈసారి కూడా అదే చేస్తున్నారు.

వాస్తవానికి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తయారు చేయించిన విద్యా కానుక కిట్లను కొత్త ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా మార్చి ఇచ్చేందుకు సమయం సరిపోలేదు. దీంతో ఇప్పటికే కొనుగోలు చేసిన కిట్లనే పంపిణీ చేసేందుకు వీలుగా కొత్త ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో వైసీపీ రంగులతో ఉన్న కిట్లనే విద్యార్ధులకు ఈసారికి ఇస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి విద్యా కానుక కిట్లు, పేర్లలో మార్పులు చేసే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications