Nara Lokesh Red Book: రెడ్ బుక్ పేరుతో బెదిరిస్తావా ? లోకేష్ కు సీఐడీ నోటీసులు..
టీడీపీ నేత నారా లోకేష్ తాజాగా పోలిపల్లిలో జరిగిన యువగళం ముగింపు సభలో రెడ్ బుక్ తో కనిపించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతల్ని, కార్యకర్తల్ని వేధించిన వారి పేర్లను ఇందులో రాస్తున్నానని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారి సంగతి తేలుస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై సీఐడీ గుర్రుగా ఉంది. ఇప్పటికే రెడ్ బుక్ వ్యవహారంపై విజయవాడ ఏసీబీ కోర్టును ఆశ్రయించిన సీఐడీ ఇవాళ లోకేష్ కు నోటీసులు జారీ చేసింది.

రెండేళ్ల క్రితమే టీడీపీ కార్యకర్తలు, నేతలపై పోలీసులు, సీఐడీ వేధింపులు కొనసాగుతున్న క్రమంలో నారా లోకేష్ రెడ్ బుక్ ప్రస్తావన తెచ్చారు. రెడ్ బుక్ లో టీడీపీ వారిని వేధిస్తున్న అధికారుల పేర్లు రాస్తున్నట్లు ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. అప్పటి నుంచి ఈ రెడ్ బుక్ పలుమార్లు తెరపైకి వచ్చింది. తాజాగా యువగళం సభలో లోకేష్ మరోసారి రెడ్ బుక్ ప్రస్తావన చేయడంతో సీఐడీ అధికారులు కోర్టును ఆశ్రయించారు.
రెడ్ బుక్ పేరుతో లోకేష్ తమను బెదిరిస్తున్నారంటూ సీఐడీ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టుకు తెలిపారు. ఈ వ్యవహారంలో ఆయన్ను అరెస్టు చేసేందుకు అనుమతివ్వాలని కోరారు. దీనిపై స్పందించిన కోర్టు ముందుగా నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేసి విచారించాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇవాళ సీఐడీ అధికారులు లోకేష్ వాట్సాప్ కు ఈ మేరకు నోటీసులు పంపారు. దీంతో లోకేష్ కూడా తనకు నోటీసులు అందినట్లు సీఐడీకి నిర్ధారించారు.
మరోవైపు లోకేష్ ను రెడ్ బుక్ కేసులో విచారించేందుకు సీఐడీ నోటీసులు జారీ చేసినా వెంటనే విచారణ జరిగే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. దీనికి కారణం విజయవాడ ఏసీబీ కోర్టు ఈ కేసులో తదుపరి విచారణను జనవరి 9కి వాయిదా వేయడమే. ఆ రోజు విచారణలో కోర్టు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా సీఐడీ అధికారులు లోకేష్ పై తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications