ఒకే రోజులో రాజమండ్రి నుంచి అరకు వెళ్లిరండి-ఆర్టీసీ కొత్త బస్సు-టికెట్ ఇలా..!
గోదావరి జిల్లాల నుంచి అరకులో పర్యాటక అందాల్ని చూసేందుకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు ఆర్టీసీ (APSRTC) కొత్తగా మరో సర్వీసు ప్రారంభించింది. తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమండ్రి నుంచి నేరుగా అరకుకు సూపర్ లగ్జరీ ప్రయాణం చేసేలా ఈ సర్వీసును అందుబాటులోకి తెచ్చారు. ఈ బస్సు టైమింగ్స్, స్టాప్ లు, టికెట్ రేట్లు, ఇతర వివరాలను ఏపీఎస్ఆర్టీసీ విడుదల చేసింది. వచ్చే సీజన్ లో అరకు అందాల్ని చూసేందుకు ప్రయాణికులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో వారికి ఈ సర్వీసు ఎంతో ఉపయోగపడనుంది.
ప్రతీ రోజూ ఉదయం రాజమండ్రి నుంచి బయలుదేరే ఈ కొత్త సూపర్ లగ్జరీ బస్సు (Rajahmundry to Araku) మధ్యాహ్నానికి అరకు చేరుకుని, అక్కడి నుంచి తిరిగి బయలుదేరుతుంది. అనంతరం సాయంత్రానికి తిరిగి రాజమండ్రి వచ్చేస్తుంది. ఉదయం 5 గంటలకు రాజమండ్రిలో ఈ బస్సు ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి రంపచోడవరం, గంగవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి, పాడేరు, అరకు మీదుగా మధ్యాహ్నం 12 గంటలకు అరకు చేరుకుంటుంది.

తిరిగి 2 గంటలకు అరకు నుంచి బయలుదేరే ఈ బస్సు పాడేరు, చింతపల్లి, రాజవొమ్మంగి, అడ్డతీగల, మీదుగా రాత్రి 9 గంటలకు రాజమండ్రి చేరుకుంటుంది. దీని టికెట్ ధరను రూ.560గా నిర్ణయించారు. టికెట్లను ప్రయాణికులు ఆన్ లైన్ లో ముందస్తుగా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరిన్ని వివరాలకు ఆర్టీసీ వెబ్ సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది. రాజమండ్రి నుంచి ఒక్క రోజులో అరకు వెళ్లి తిరిగి రావాలనుకునే ప్రయాణికులకు కూడా ఇది మంచి అవకాశం కానుంది.












Click it and Unblock the Notifications