జగన్ ఉత్తరాంధ్రకు ఏం చేశారు ? ఉత్తరాంధ్ర అభివృద్ధిపై వైసీపీ చర్చకు రావాలని అచ్చెన్నాయుడు సవాల్ !!
ఆంధ్రప్రదేశ్ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వైసీపీ ప్రభుత్వం, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడుతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో అభివృద్ధి శూన్యంగా మారిందని ఆయన విమర్శిస్తున్నారు. ఇదే సమయంలో ఉత్తరాంధ్ర ప్రాంతం పూర్తిస్థాయిలో నిర్లక్ష్యానికి గురైందని, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై దమ్ముంటే వైసిపి చర్చకు రావాలని సవాల్ విసిరారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధిపై వైసీపీ ప్రభుత్వానికి ఛాలెంజ్
ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్ర అభివృద్ధిపై వైసీపీ ప్రభుత్వానికి ఛాలెంజ్ చేశారు. ఏ అంశంపైన అయినా తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని వేదిక ఎక్కడో అధికార పార్టీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. సోమవారం విశాఖ టీడీపీ కార్యాలయంలో ఉత్తరాంధ్ర రక్షణ చర్చావేదికలో ఆయన మాట్లాడుతూ విశాఖలో మెడ్ టెక్ జోన్ పై ఇష్టమొచ్చినట్టు మాట్లాడారని, అదే మెడ్ టెక్ జోన్ కరోనా సమయంలో ప్రాణాలు కాపాడింది అని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ లూలూ గ్రూపు తీసుకొని వస్తే, పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన గ్రూపును వైసీపీ నేతలు పంపించేశారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో రాష్ట్రానికి పెట్టుబడులు కూడా కరువవుతున్నాయని మండిపడ్డారు .

ఉత్తరాంధ్ర ప్రజలను వైసీపీ ఓటు బ్యాంకుగానే చూసింది
ఇప్పటివరకు ఉత్తరాంధ్ర ప్రజలను వైసిపి కేవలం ఓటు బ్యాంకు గానే చూసిందని విమర్శించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వంశధార బహుదా నదుల అనుసంధానం చంద్రబాబు ఆకాంక్ష అని వెల్లడించిన అచ్చెన్నాయుడు, వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో చేసిందేమీ లేదని, వాటిని అనుసంధానం చెయ్యటానికి కూడా ప్రయత్నాలు జరగలేదని ప్రభుత్వం ఉత్తరాంధ్రను భ్రష్టు పట్టిస్తోంది అని అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు.

ఉత్తరాంధ్ర మంత్రులకు ఎస్ బాస్ అనడం తప్ప ఇంకేమీ రాదు
ఉత్తరాంధ్ర మంత్రులు సీఎం జగన్ మోహన్ రెడ్డి దగ్గర ఈ ప్రాంత సమస్యలను ప్రస్తావించగలరా అంటూ ప్రశ్నించిన అచ్చెన్నాయుడు, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి మాట్లాడే సత్తా ఒక్క మంత్రికి కూడా లేదని ఎద్దేవా చేశారు .ఇక ఉత్తరాంధ్ర మంత్రులకు ఎస్ బాస్ అనడం తప్ప ఇంకేమీ రావని విమర్శించారు. అభివృద్ధి చేయాలని సిఎం అనుకుంటే ఏమైనా చెయ్యొచ్చని కానీ జగన్ ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏమీ చేయలేదని వ్యాఖ్యానించారు. అభివృద్ధి చేయలేక మూడు రాజధానులు అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చారని విమర్శించారు. టిడిపి పాలనలో ఏం చేసిందో చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని, వైసిపి పాలనలో మీరేం చేశారో చెప్పగలరా అంటూ నిలదీశారు.

నిత్యం జగన్ సర్కార్ వైఫల్యాలపై విరుచుకుపడుతున్న అచ్చెన్న
టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఏ మాత్రం చిన్న అవకాశం దొరికినా, వైయస్ జగన్మోహన్ రెడ్డిని, వైసిపి నాయకులను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ప్రజా క్షేత్రంలో ఎండగట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోయిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ తో పాటు నిత్యావసర వస్తువుల ధరల పై తీవ్రస్థాయిలో నిరసనలు చేపట్టి ప్రభుత్వం ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఇక తాజాగా ఉత్తరాంధ్ర ప్రాంతం వైసిపి పాలనలో అభివృద్ధి చెందలేదని, ఒకవేళ అభివృద్ధి చేస్తే ఏం చేశారో చెప్పాలని అచ్చెన్న వైసిపి నేతలను ఉద్దేశించి చాలెంజ్ చేశారు.












Click it and Unblock the Notifications