క్రైస్తవ బోధకుడు గ్రాహం స్టెయిన్స్ హంతకుడికి విముక్తి-25 ఏళ్ల తర్వాత విడుదల..!
ఆస్ట్రేలియాకు చెందిన క్రైస్తవ మత ప్రబోధకుడు గ్రాహం స్టెయిన్స్ ను, ఆయన ఇద్దరు మైనర్ కుమారుల్ని జీపులో సజీవదహనం చేసిన కేసులో దోషిగా తేలి పాతికేళ్లుగా జైలుశిక్ష అనుభవిస్తున్న మహేంద్ర హెంబ్రమ్ ఇవాళ విడుదలయ్యాడు. ఈ కేసులో పాతికేళ్లుగా జైలుశిక్ష అనుభవిస్తున్న మహేంద్ర హెంబ్రమ్ ను ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం సత్ప్రవర్తన కింద జైలు నుంచి విడుదల చేసింది. ఈ నిర్ణయాన్ని విశ్వహిందూ పరిషత్ స్వాగతించింది.
1999 జనవరిలో ఒడిశాలోని కియోంజర్ జిల్లాలోని మనోహర్ పూర్ లో జీపులో నిద్రిస్తున్న గ్రాహం స్టెయిన్స్, ఆయన ఇద్దరు మైనర్ కుమారుల్ని పెట్రోల్ పోసి కొందరు నిప్పంటించారు. క్రైస్తవ మత మార్పిడులకు పాల్పడుతున్నాడనే కారణంతో దారాసింగ్ అనే ప్రధాన దోషితో పాటు మహేంద్ర హెంబ్రమ్ మరికొందరు ఇలా ఆయన్ను హతమార్చారు. ఈ కేసులో మొత్తం 51 మంది నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు.

సుదీర్ఘ విచారణ తర్వాత కోర్టు ఇందులో 37 మందికి మూడేళ్ల జైలుశిక్ష మాత్రమే విధించింది. కానీ ప్రధాన నిందితులైన దారాసింగ్, హెంబ్రమ్ కు మాత్రం జీవిత ఖైదు విధించింది. దీంతో వీరు అప్పటి నుంచి జైల్లోనే మగ్గుతున్నారు.ఈ నేపథ్యంలో తాజాగా ఒడిశాలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ముందుగా మహేంద్ర హెంబ్రమ్ ను సత్ప్పవర్తన కారణంగా విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది.
దీంతో కియోంజర్ జైలు నుంచి హెంబ్రమ్ ఇవాళ విడుదలయ్యాడు. తాను చేయని తప్పిదానికి పాతికేళ్లు జైల్లో గడిపినట్లు హెంబ్రమ్ చెప్తున్నాడు. మరోవైపు హెంబ్రమ్ విడుదలను విశ్వహిందూ పరిషత్ స్వాగతించింది. ఇదో శుభదినం అని వీహెచ్ పీ నేతలు వ్యాఖ్యానించారు. అటు మరో నిందితుడు దారా సింగ్ క్షమాభిక్ష పెట్టి విడుదల చేయాలని సుప్రీంకోర్టుతో పాటు రాష్ట్రపతి వద్దా గతేడాది పిటిషన్లు పెట్టుకున్నాడు. ఇవి పెండింగ్ లో ఉన్నాయి.












Click it and Unblock the Notifications