చంద్రబాబు-పవన్ జోడీతో మళ్లీ పాత చర్చ ! పొత్తు నుంచి పోటుకు ! ఎవరిలెక్కలువారివే !
ఏపీలో చంద్రబాబు అరెస్టు తర్వాత రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. అసలే ఎన్నికల వేళ అనూహ్యంగా చంద్రబాబు జైలుకు వెళ్లడం, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వంటి వారు లీడ్ తీసుకుంటుండటం, చివరిగా పవన్ టీడీపీతో పొత్తుల ప్రకటన ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయాలపై చర్చలకు కారణమవుతున్నాయి. ఇన్నాళ్లూ పవన్ చంద్రబాబుకు రహస్య మిత్రుడిగా విమర్శలు చేసిన వైసీపీకి ఇప్పుడు వీరిద్దరి పొత్తుతో ఆ అవకాశం పోయింది. దీంతో వైసీపీ పాత అంశాలకే కొత్త రంగులద్ది తెరపైకి తెస్తోంది. తద్వారా జనసేన క్యాడర్ లో అనుమానాలు తెచ్చి ఈ కూటమిని ఆత్మరక్షణలోకి నెట్టే పనిలో బిజీగా ఉంది.
గతంలో చంద్రబాబు, బీజేపీతో పొత్తు పెట్టుకుని, 2019 ఎన్నికల నాటికి వీరిద్దరికీ వరుసగా గుడ్ బై చెప్పేసి అనంతరం ఒంటరిగా పోటీ చేసి ఓటమి పాలైన పవన్ కళ్యాణ్.. అప్పట్లో టీడీపీకి గుడ్ బై చెప్పే సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే బీజేపీ విషయంలోనూ చేశారు. టీడీపీ వెన్నుపోటు పొడిస్తే పొడిపించుకోవడానికి సిద్ధంగా లేనన్న పవన్.. బీజేపీ ఏపీకి పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందని విమర్శించారు. దీంతో ఈ రెండు వ్యాఖ్యలు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. ఇప్పుడు మళ్లీ అవే తిరిగి తెరపైకి వస్తున్నాయి.

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి పోటీ చేయబోతున్నట్లు రాజమండ్రి జైలు బయట పవన్ చేసిన ప్రకటనతో ఏపీలో రాజకీయ పార్టీలన్నీ ఒక్కసారిగా షాకయ్యాయి. టీడీపీ-జనసేన పొత్తు ఉండబోదని ఎవరూ అనుకోకపోయినా ఇంత హఠాత్తుగా ఇలా ప్రకటన వస్తుందని మాత్రం ఊహించలేదు. తద్వారా చంద్రబాబు అరెస్టు కంటే టీడీపీ-జనసేన పొత్తుపైకి చర్చ మళ్లింది. ఆ రెండు పార్టీలకు కావాల్సిందీ ఇదే. అయితే పవన్ ప్రకటనతో షాకైన వైసీపీ.. ఆ తర్వాత కోలుకుని ఇప్పుడు పాత విషయాలను కెలుకుతోంది. ముఖ్యంగా పవన్ వెన్నుపోటు డైలాగ్ ను తెరపైకి తెస్తోంది.
చంద్రబాబుతో పొత్తుకున్న పవన్ ను, జనసేన క్యాడర్ ను ఆత్మరక్షణలోకి నెట్టేలా గతంలో చేసిన వెన్నుపోటు వ్యాఖ్యల్ని తెరపైకి తెస్తోంది. చంద్రబాబును నమ్ముకుంటే ఏదో ఒక రోజు వెన్నుపోటు తప్పదనే అంశాన్ని వైసీపీ వైరల్ చేస్తోంది. అయితే దీనికి కౌంటర్ గా చంద్రబాబుతో పొత్తు వల్ల తమ నేత పవన్ సీఎం అయ్యే అవకాశముందన్న విషయాన్ని జనసేన తెరపైకి తెస్తోంది. టీడీపీ సైతం ఇదే వాదనకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. పవన్ తో అధికారం పంచుకోబోతున్నామనే చర్చతో టీడీపీ నేతలు ముందుకెళ్తున్నారు. దీంతో వెన్నుపోటు వర్సెస్ అధికార భాగస్వామ్యం చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్రంగా సాగుతోంది.












Click it and Unblock the Notifications