బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఆంధ్రప్రదేశ్‌కు మళ్ళీ వర్ష గండం!
బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడనం రూపుదిద్దుకుంటోంది. దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో నవంబర్ 13నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.ఈ అల్పపీడనం వాయువ్య దిశగా పయనిస్తూ తర్వాతి 24 గంటల్లో మరింత బలపడి సుస్పష్టమైన అల్పపీడనంగా మారే అవకాశం ఉంది.
ఆ తర్వాత ఆదివారం నాటికి అదే ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశముందని అంచనా. శనివారం నుంచి మంగళవారం వరకు సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉండటంతో మత్స్యకారులు ఆగ్నేయ, నైరుతి, మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌పై ఈ వ్యవస్థ ప్రభావం లేదు. రాబోయే మూడు రోజుల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో పొడి వాతావరణం నెలకొనే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

భూమి నుంచి సముద్రం వైపు పొడి గాలులు వీస్తున్నందున ఈ వ్యవస్థ తీరం దాటకముందే కొంత బలహీనపడవచ్చు. అయినప్పటికీ ఇది తుఫాను స్థాయికి చేరుకోకపోయినా తీవ్ర వాయుగుండంగా లేదా వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఈ నెల 16, 17 తేదీల్లో దక్షిణ కోస్తాంధ్ర లేదా ఉత్తర తమిళనాడు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా.
ముఖ్యంగా ఒంగోలు, చెన్నై, పుదుచ్చేరి ప్రాంతాల మధ్య తీరం దాటవచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కొన్ని అంచనాలు సూచిస్తున్నాయి.తెలంగాణలో మాత్రం రాత్రులు చలి తీవ్రత పెరుగుతోంది. పగటిపూట ఎండలు కొనసాగుతాయి.
రాబోయే వారం రోజుల పాటు వర్ష సూచన లేదు. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని వాతావరణ శాఖ కోరింది. సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులు తాజా అప్డేట్లను తప్పనిసరిగా తెలుసుకోవాలని వాతావరణ శాఖ పేర్కొంది. వాతావరణ పరిస్థితులు మారుతున్నందున రోజువారీ సూచనలు పరిశీలించాలని సూచించారు.













Click it and Unblock the Notifications
