టాటా పంచ్‌కు రోజులు దగ్గరపడ్డాయా? మారుతి కొత్త ఎస్యూవీ వచ్చేస్తోంది!
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో తిరుగులేని విజయాన్ని సాధిస్తున్న టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్టర్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ 'మారుతి సుజుకి' సమాయత్తమవుతోంది. ప్రస్తుతం భారత రోడ్లపై మైక్రో ఎస్‌యూవీల హవా నడుస్తుండటంతో కంపెనీ 'మారుతీ Y43' అనే కోడ్‌నేమ్‌తో సరికొత్త మైక్రో-ఎస్‌యూవీని శరవేగంగా అభివృద్ధి చేస్తోంది. 2021 అక్టోబర్‌లో మార్కెట్లోకి వచ్చిన టాటా పంచ్ ఇప్పటికే 8 లక్షలకు పైగా కార్లను విక్రయించి తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈ విజయానికి చెక్ పెడుతూ.. మారుతి సుజుకి తన కొత్త మోడల్‌ను 2027 నాటికి భారత మార్కెట్లో ఆవిష్కరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.
జపనీస్ డిజైన్‌తో బాక్సీ లుక్
గతంలో మారుతి తీసుకొచ్చిన 'ఇగ్నిస్' మోడల్ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోవడంతో 2026 ప్రారంభంలో దాని ఉత్పత్తిని నిలిపివేశారు. ఆ స్థానాన్ని భర్తీ చేస్తూ.. పూర్తిగా కొత్త రూపురేఖలతో ఈ మైక్రో-ఎస్‌యూవీని తీర్చిదిద్దుతున్నారు. హర్యానాలోని ఖార్ఖోడా ప్లాంట్‌లో ఇటీవల దీని టెస్టింగ్ వేరియంట్ కనిపించింది. జపనీస్ 'Kei-Car' కాన్సెప్ట్ ఆధారంగా చతురస్రాకారపు(బాక్సీ) డిజైన్, ఫ్లాట్ బోనెట్‌తో ఇది రూపొందుతోంది. భారతీయ రోడ్ల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని 190 మిల్లిమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్, 16-ఇంచుల అలాయ్ వీల్స్‌ను ఇందులో అందించనున్నారు.

హైటెక్ కేబిన్.. ప్రీమియం ఫీచర్లు
వినియోగదారుల ఆధునిక అవసరాలకు అనుగుణంగా కేబిన్‌లో సన్‌రూప్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్లెస్ ఛార్జర్, 50 వాట్ల కంటే ఎక్కువ అవుట్‌పుట్ ఇచ్చే ఫాస్ట్ టైప్-సీ యూఎస్బీ పోర్టులు, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి అధునాతన సౌకర్యాలను పొందుపరచనున్నారు. భద్రతకు పెద్దపీట వేస్తూ 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా సిస్టమ్, ఎల్ఈడీ ఫాగ్ లాంప్లను కూడా జోడించనున్నారు.
పెట్రోల్, సీఎన్జీ వెర్షన్లలో లభ్యం
ఈ కొత్త కారులో Z12E 1.2-లీటర్ 3-సిలిండర్ ఇంజిన్‌ను అమర్చనున్నారు. ఇది పెట్రోల్ మోడ్‌లో 82HP పవర్, 112.4 Nm టార్క్‌ను, సీఎన్జీ మోడ్‌లో 69HP పవర్, 101.8 Nm టార్క్‌ను అందిస్తుంది. రెండింటిలోనూ 5-స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్లు లభిస్తాయి. భవిష్యత్తులో ఈ మోడల్లో సొంతంగా అభివృద్ధి చేసిన సిరీస్-హైబ్రిడ్ టెక్నాలజీని కూడా తీసుకురావడానికి కంపెనీ ఆలోచిస్తోంది. అందుబాటు ధర, అత్యధిక మైలేజ్, మారుతి సుజుకికి ఉన్న విస్తృతమైన సర్వీస్ నెట్వర్క్ కారణంగా ఈ కొత్త మైక్రో-ఎస్యూవీ మిడిల్ క్లాస్ వినియోగదారులను విశేషంగా ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి.














Click it and Unblock the Notifications
