మదర్ డెయిరీ పాల రేట్లు పెంపు: రేపటి నుంచి లీటర్ కు ఇంత
మదర్ డెయిరీ మరోసారి బిగ్ షాక్ ఇచ్చింది. పాల ధరను పెంచింది. లీటరుకు 2 నుంచి 4 రూపాయల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మదర్ డెయిరీ తయారు చేసే అన్ని రకాల వేరియంట్లపై గరిష్టంగా నాలుగు రూపాయల వరకు పెరిగింది. పెరిగిన పాల ధరలు బుధవారం నుంచి అమలులోకి రానున్నాయి. ఇది.. సామాన్య, మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్‌పై అదనపు భారాన్ని మోపడం ఖాయంగా కనిపిస్తోంది.
గత ఆరు నెలల వ్యవధిలోనే మదర్ డెయిరీ పాల ధరలు పెరుగుదల బాట పట్టడం ఇది రెండోసారి. పశుగ్రాసం ధరలు, సేకరణ వ్యయం అధికమవడమే ఈ నిర్ణయానికి సంస్థ యాజమాన్యం వెల్లడించింది. పాడి రైతులకు చెల్లించే కొనుగోలు ధర, ముడి వ్యయాల భారం అధికం అయిందని అందువల్లే పాల ధరలను స్వల్పంగా పెంచక తప్పట్లేదని స్పష్టం చేసింది. రవాణా భారం కూడా సంస్థపై అదనంగా పడుతోందని పేర్కొంది.

నూతన ధరల ప్రకారం.. మదర్ డెయిరీ ఫుల్ క్రీమ్ పాలు లీటరు ధర రూ. 74 నుంచి రూ. 76 కి చేరింది. టోన్డ్ మిల్క్ లీటరు ధర రూ. 60 నుంచి రూ. 62 కు పెరిగింది. అలాగే డబుల్ టోన్డ్ పాలు లీటరు రూ. 54 నుంచి రూ. 56 కు చేరగా, ఆవు పాల ధర లీటరుకు రూ. 62 నుంచి రూ. 65 కి పెరిగింది. ఢిల్లీ- నేషనల్ కేపిటల్ రీజియన్ పరిధిలో విక్రయించే ఓపెన్ టోన్డ్ పాలు లీటరు చొప్పున రూ. 58 నుంచి రూ. 60 కి చేరాయి.
నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ కింద 1974లో ప్రారంభమైంది మదర్ డెయిరీ. ఢిల్లీ-ఎన్‌సీఆర్ లో రోజూ దాదాపు 35 లక్షల లీటర్ల పాలను విక్రయిస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ నెట్‌వర్క్‌ల ద్వారా దీని విక్రయాలు రోజుకు 50 లక్షల లీటర్లకు పైమాటే. పాల అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంలో 75 నుంచి 80 శాతం సొమ్మును కంపెనీ నేరుగా పాడి రైతులకే అందిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ రూ. 20,300 కోట్ల టర్నోవర్ సాధించింది.
ఇప్పటికే ఉల్లిపాయలు, టమాటోలు మొదలుకుని అన్ని రకాల కూరగాయల ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో పాలు కూడా ప్రియం కావడం మరింత ప్రతికూల ప్రభావం చూపనుంది. ఇటీవలే కర్ణాటకలో నందిని పాలు, పాల ఆధారిత ఉత్పత్తుల రేట్లు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. మదర్ డెయిరీ కూడా అదే బాట పట్టింది. పశుగ్రాసం కొరత, ఇంధన ధరల పెరుగుదల కారణంగా రవాణా వ్యయం అధికమవడం వల్ల రాబోయే రోజుల్లో ఇతర డెయిరీ బ్రాండ్లు కూడా ఇదే తరహాలో ధరల సవరణ చేపట్టే సూచనలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications
