కొండగట్టు అంజన్న ఆలయంలో 60 ఏళ్ల తర్వాత- చందనోత్సవం, నిజరూప దర్శనం..!!
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు అంజన్న ఆలయంలో 60 ఏళ్ల తర్వాత అద్బుత ఘట్టం. అత్యంత అరుదైన చందనోత్సవం .. సంప్రోక్షణ మహోత్సవం ముహూర్తం ఖరారు చేసారు. 41 రోజుల పాటు భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం లభించనుంది. ఇందుకు సంబంధించి భక్తులకు దర్శన సమయాలతో పాటుగా ప్రత్యేక ఏర్పాట్ల గురించి అధికారులు వివరించారు. స్వామి నిజరూప దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రానున్నారు.
కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో అత్యంత అరుదైన, పవిత్రమైన చందనోత్సవానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 60 ఏళ్లకు ఒకసారి మాత్రమే నిర్వహించే ఈ విశిష్ట ఆధ్యాత్మిక క్రతువు నవంబర్ 15 నుంచి 20వ తేదీ వరకు వైభవంగా జరగనుంది. బాల్యంలో ఈ ఉత్సవాన్ని దర్శించుకున్న భక్తులకు జీవిత చరమాంకంలో మాత్రమే తిరిగి చూసే అరుదైన అవకాశం లభిస్తుందనే బలమైన విశ్వాసం వందల ఏళ్లుగా భక్తుల్లో కొనసాగుతోంది. ఈ పవిత్ర ఉత్సవంలో భాగంగా స్వామివారి మూలవిరాట్‌పై ఉన్న చందనం, సింధూరాన్ని వేద మంత్రోచ్ఛా రణల మధ్య సంప్రదాయబద్ధంగా తొలగించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నవంబర్ 20వ తేదీ ఉదయం 9.59 గంటలకు స్వామివారి మూలవిరాట్ నిజరూప దర్శనం ప్రారంభమవుతుంది.

భక్తులకు అరుదైన అవకాశం
భక్తులకు 41 రోజుల పాటు స్వామివారి అసలు రూపాన్ని దర్శించుకునే అద్భుత అవకాశం అందుబాటులో ఉండనుంది. దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత జరుగుతున్న ఈ అరుదైన ఆధ్యాత్మిక ఘట్టాన్ని తిలకించేందుకు తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. భక్తులకు ఎలాంటి తీవ్ర ఇబ్బందులు తలెత్తకుండా దర్శన క్యూలైన్లు, తాగునీరు, రవాణా, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు అంజన్నగా భావించే భక్తులు స్వామివారి నిజరూప దర్శనం కోసం రాష్ట్ర నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో ఆలయ అధికారులు అందుకు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.













Click it and Unblock the Notifications
