రష్మికతో డేటింగ్ పై క్లారిటీ ఇచ్చిన హీరో
స్టార్ హీరోయిన్ రష్మిక హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. కొన్నిసార్లు విమానాశ్రయంలో వీరిద్దరూ కలిసి కనిపించడంతో ఈ వార్త జోరందుకుంది. దీనిపై కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ స్పందించారు. ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇలాంటి అభూతకల్పనలు ఎలా సృష్టిస్తారంటూ అసహనం వ్యక్తం చేశారు.
హిందీ 'ఛత్రపతి' ప్రచారంలో భాగంగా బెల్లంకొండ ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. రష్మికతో డేటింగ్ వార్తలపై మాట్లాడుతూ తామిద్దరం ప్రేమలో ఉన్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. తాను, రష్మిక ఇద్దరూ మంచి స్నేహితులమని, హైదరాబాద్ కు చెందినవాళ్లం కావడంతో షూటింగ్ కోసం ముంబయి వెళ్లివస్తుంటామని, అలా ఎయిర్ పోర్టులో కలుసుకుంటామని,, దీనికే ఇలాంటి వార్తలు రాస్తే ఎలా? అని శ్రీనివాస్ ప్రశ్నించారు. కలుసుకున్న సందర్భాలే చాలా తక్కువ అని, వస్తున్న వార్తలన్నీ రూమర్స్ అని ఖండించారు.

ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ చిత్రం 'ఛత్రపతి'లో నటిస్తున్నారు. వి.వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈనెల 12వ తేదీన విడుదల కాబోతోంది. శ్రీనివాస్ సరసన నుస్రత్ భరుచా కథానాయికగా నటించారు. ట్రైలర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. ప్రభాస్ కథానాయకుడిగా రాజమౌళి తెరకెక్కించిన తెలుగు 'ఛత్రపతి'కి రీమేక్ ఇది.

బెల్లంకొండ శ్రీనివాస్ గతంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో జయజానకి నాయక సినిమా చేశారు. ఆ సినిమాను డబ్బింగ్ చేసి హిందీలో పెట్టగా యూట్యూబ్ లో 700 మిలియన్ల వ్యూస్ దక్కించుకొని రికార్డు సృష్టిస్తుంది. బెల్లంకొండ గత చిత్రాలు కూడా మంచి ఆదరణ పొందాయి. దీంతో ఛత్రపతిని రీమేక్ చేశారు. సినిమాను ఎటువంటి మార్పులు లేకుండా తీసినట్లు తెలుస్తోంది. అయితే పోరాట ఘట్టాలను మాత్రం వి.వి.వినాయక్ తనదైన శైలిలో చిత్రీకరించినట్లు ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications