ఏపీ హోంమంత్రి ప్లేటులో బొద్దింక ! గురుకుల హాస్టల్లో షాకింగ్ ఘటన..!
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితకు ఇవాళ భారీ షాక్ తగిలింది. తన నియోజకవర్గం అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పరిధిలో ఉన్న నక్కపల్లి బాలికల గురుకుల హాస్టల్ లో తనిఖీలకు వెళ్లిన సమయంలో అక్కడే భోజనం చేశారు. అయితే ఆమె తింటున్న ప్లేటులోనే బొద్దింక ప్రత్యక్షమైంది. దీంతో ఆమె ఒక్కసారిగా షాకయ్యారు. అనంతరం తేరుకుని గురుకుల హాస్టల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవాళ నక్కపల్లిలోని బీసీ గురుకుల బాలికల హాస్టల్ ను హోంమంత్రి అనిత సందర్శించారు. ఈ సందర్భంగా హాస్టల్లో బాలికలకు అందిస్తున్న వసతులపై ఆరా తీశారు. అనంతరం భోజనాల సమయం కావడంతో వారితో కలిసి తినాలని నిర్ణయించారు. దీంతో హాస్టల్ సిబ్బంది హోంమంత్రికి కూడా బాలికలతో కలిపి వడ్డించారు. వారి మధ్యే కూర్చుని భోజనం తినడం ప్రారంభించిన హోంమంత్రికి మధ్యలో షాక్ తగిలింది.

హోంమంత్రి అనిత తింటున్న ప్లేట్ లో ఉన్నట్లుండి బొద్దింక ప్రత్యక్షం కావడంతో ఆమె షాకయ్యారు. వెంటనే అక్కడున్న హాస్టల్ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను తినే ఆహారంలోనే ఇలా బొద్దింకలు వస్తున్నాయంటే ఇంకా బాలికలకు ఏం పెడుతున్నారని వారిని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చూసుకోవాలని హోంమంత్రి అనిత అక్కడి సిబ్బందికి సూచించారు. అంతే కాదు తాను తింటున్న ప్లేట్ లో ఉన్న బొద్దింకను అక్కడున్న వారికి అనిత చూపించారు. దీంతో వారు కూడా షాకయ్యారు.












Click it and Unblock the Notifications