జగన్ సర్కార్ కు ఊరట-సెకీ నుంచి సౌర విద్యుత్ కొనుగోళ్లకు ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్
ఏపీలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పార్టీలతో సంబంధం లేకుండా విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వ్యవహారం వివాదాస్పదమవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ టీడీపీ హయాం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై తీవ్ర విమర్శలు చేసింది. వాటి సమీక్షకు సిద్ధమైంది. అయితే కోర్టుల జోక్యంతో ఈ ప్రక్రియపై ముందడుగు వేయలేకపోయింది. అయితే ఇప్పుడు తమ ప్రభుత్వ హయాంలో ఎలాంటి రివర్స్ టెండర్లు, జ్యుడిషియల్ సమీక్ష లేకుండా సెకీతో సౌర విద్యుత్ కొనుగోళ్లకు సిద్ధమైంది. దీనిపై టీడీపీ తీవ్ర విమర్శలు కూడా గుప్పించింది. అయితే ఈఆర్సీ మాత్రం సెకీ నుంచి ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేసేందుకు ఇవాళ అనుమతి మంజూరు చేసింది.
రాష్ట్రంలోని విద్యుత్ సంస్ధలు సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ సెకీ నుంచి వచ్చే ఐదేళ్లలో 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ కొనుగోలు కోసం చేసిన ప్రతిపాదనల్ని ఈఆర్సీ ఆమోదించింది. ఈ మేరకు త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకునేందుకు అనుమతి మంజూరు చేసింది. అయితే ప్రభుత్వం నుంచి వీలింగ్, నెట్ వర్క్ ఛార్జీలు వసూలు చేసుకోవాలని తెలిపింది. 2024 నుంచి పాతికేళ్ల పాటు సౌర విద్యుత్ కొనుగోలు కోసం ఈఆర్సీ పచ్చజెండా ఊపింది. దీని ప్రకారం 2024 సెప్టెంబర్ నాటికి 3 వేల మెగావాట్లు, 2025 నాటికి మరో 3 వేల మెగావాట్లు, 2026 నాటికి వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు చేయనున్నారు.

బహిరంగ మార్కెట్లో 1.49కే యూనిట్ సౌర విద్యుత్ దొరుకుతుంటే ప్రభుత్వం మాత్రం 2.49కి కొనుగోలు చేస్తోందని, మన వద్దకు వచ్చేసరికి ఇది కాస్తా 3 నుచి 4 రూపాయలకు పెరుగుతుందని టీడీపీ ఆరోపిస్తోంది. సెకీ నుంచి విద్యుత్ కొనుగోలుకు ప్రభుత్వం చేసుకుంటున్న ఒప్పందం అక్రమమని పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై ఆయన హైదరాబాద్ లోని ఈఆర్సీ కార్యాలయానికి వెళ్లి మరీ ఫిర్యాదు చేశారు. అయితే ఈఆర్సీ మాత్రం పయ్యావుల ఆరోపణల్ని పట్టించుకోనట్లే కనిపిస్తోంది. ప్రభుత్వం కోరుకున్న విధంగానే సౌర విద్యుత్ కొనుగోళ్లకు ఈఆర్సీ ఇచ్చిన ఆమోదంతో టీడీపీతో పాటు పయ్యావులకూ గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.












Click it and Unblock the Notifications