YS Jagan: వైఎస్ జగన్ కు హైకోర్టులో బిగ్ రిలీఫ్-సింగయ్య కేసులో కీలక ఆదేశాలు..!
ఏపీ హైకోర్టులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు ఇవాళ భారీ ఊరట లభించింది. పల్నాడు టూర్ సందర్భంగా రెంటపాళ్లకు వెళ్తుండగా.. మధ్యలో గుంటూరు వద్ద సింగయ్య అనే కార్యకర్త తన కారు కింద పడి చనిపోయిన వ్యవహారంలో నమోదైన కేసులో నిందితుడిగా ఉన్న జగన్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఈ మేరకు హైకోర్టు ఇవాళ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది.
గత నెలలో పల్నాడు పర్యటనకు జగన్ వెళ్లారు. మార్గమధ్యలో గుంటూరు సమీపంలో వైసీపీ అభిమానులు ఒక్కసారిగా జగన్ కాన్వాయ్ మీదకు వచ్చారు. ఈ సమయంలో సింగయ్య అనే కార్యకర్త జగన్ కారు కింద పడి చనిపోయారు. దీనిపై పోలీసులు ముందుగా జగన్ కాన్వాయ్ లో వేరే కారు ఢీకొని అతని చనిపోయాడని చెప్పి ఆ తర్వాత వీడియో ఆధారంగా జగన్ కారు కిందే పడే చనిపోయాడని తేల్చారు. ఈ కేసులో జగన్ తో పాటు కారు డ్రైవర్ రమణారెడ్డి, మాజీ మంత్రులు విడదల రజనీ, అంబటి రాంబాబు, వైవీసుబ్బారెడ్డిని సైతం నిందితులుగా చేర్చారు. దీన్ని సవాల్ చేస్తూ జగన్ సహా వీరంతా క్వాష్ పిటిషన్లు వేశారు.
కారులో ప్రయాణించామనే కారణంతో తమపై కేసులు పెట్టడాన్ని జగన్ సహా ఇతర నిందితులు హైకోర్టులో సవాల్ చేశారు. వీరు దాఖలు చేసిన వేర్వేరు క్వాష్ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. ఇవాళ ఈ కేసులో తదుపరి దర్యాప్తును నిలిపేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేసేందుకు ఏజీ రెండు వారాల సమయం కోరడంతో తదుపరి విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది.

ఇవాళ జగన్ సహా ఇతరులు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లపై విచారణ సందర్భంగా హైకోర్టులో ఆసక్తికర వాదనలు సాగాయి. ఈ కేసులో అదనపు సమాచారం సమర్పించడానికి గత విచారణలో ఏజీ సమయం అడిగారు. ఇవాళ విచారణలో ఎఫ్ఐఆర్ సమాచారం సరిపోతుంది కదా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. అయితే జగన్ వాదనపై కౌంటర్ దాఖలుకు రెండు వారాల సమయం కావాలని ఏజీ కోరారు. దీంతో విచారణ వాయిదా వేయడంతో పాటు అప్పటివరకూ తదుపరి చర్యల్ని నిలిపేస్తూ హైకోర్టు న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు.












Click it and Unblock the Notifications