ఎమ్మెల్యే వాసుపల్లికి బిగ్ షాక్.. విశాఖ దక్షిణ నియోజకర్గంలో ఏం జరుగుతుంది?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం ఉన్నప్పటికీ ఇప్పటినుంచే ఆయా నియోజకవర్గాలలో అన్ని పార్టీల నుండి అభ్యర్థులుగా బరిలోకి దిగడానికి ఆశావహులు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు తాజాగా జరుగుతున్న పరిణామాలతో హాట్ టాపిక్ గా మారింది.
విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కు ఊహించని షాక్ తగిలింది. విశాఖ దక్షిణ నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన పైన పోస్టర్లు హల్చల్ చేస్తున్నాయి. రాజకీయ నిలకడలేని నేత.. నీకో నమస్కారం అంటూ పోస్టర్లు వేసిన కొందరు నువ్వు ఏ పార్టీ నుండి పోటీ చేస్తావు? ఏ పార్టీలోకి వెళతావు? అని ప్రశ్నిస్తూ ఆయనను టార్గెట్ చేశారు.

ఆ పోస్టర్ లలో పైన ప్రధాన పార్టీల గుర్తులు ఫోటోలు వేసి మరీ టార్గెట్ చేశారు. 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్ తదనంతర పరిణామాలతో వైఎస్ఆర్సిపి బాట పట్టారు. వాసుపల్లి వైసిపి కి మద్దతు పలకడాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గం మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది.
విశాఖ దక్షిణ నియోజకవర్గం నుండి ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన సీతంరాజు సుధాకర్ టికెట్ రేసులో ఉన్నారు. ఇక ఎప్పుడైతే వాసుపల్లి గణేష్ వైసిపి కి మద్దతు తెలిపారో అప్పటి నుంచి వీరిద్దరి మధ్య పార్టీలో ఆధిపత్య పోరు కొనసాగుతుంది. నియోజకవర్గంలో ఈ వర్గ పోరు తోనే పోస్టర్లను అంటించారు అనే ప్రచారం జరుగుతుంది.
దీనిపై వాసుపల్లి గణేష్ కుమార్ చాలా సీరియస్ అవుతున్నారు. తనను వ్యతిరేకించే వర్గమే ఈ పని చేసిందని ఆయన మండిపడుతున్నారు. ఇలా పోస్టర్లతో అవమానించడం దేనికంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద విశాఖ దక్షిణ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు ముదరడంతో తాజా పరిణామాల నేపథ్యంలో అధిష్టానం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అన్నది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications