ఒక్కడివే వచ్చినా.. కట్టగట్టుకుని వచ్చినా సరే.. కొడాలి నానికి బీజేపీనేత విష్ణువర్ధన్ రెడ్డి సవాల్
గుడివాడలో బీజేపీ ఛార్జిషీట్ సందర్భంగా కొడాలి నాని ని టార్గెట్ చేసి బీజేపీ ఏపీ ఇంచార్జ్ సునీల్ దియోధర్ చేసిన వ్యాఖ్యల తర్వాత గుడివాడలో రాజకీయాలు వేడెక్కాయి. తాజాగా మాజీమంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు.
విశాఖలో మీడియాతో మాట్లాడిన విష్ణువర్ధన్ రెడ్డి రేపు గుడివాడ బస్టాండ్ దగ్గరకు వస్తే బహిరంగ చర్చ పెడదామని కొడాలి నానికి సవాల్ చేశారు. ప్రజా చార్జిషీట్లో ఉన్న అంశాలపై చర్చకు తాము సిద్ధమంటూ పేర్కొని, మాజీ మంత్రి కొడాలి నాని వచ్చినా , లేదా కట్టకట్టుకుని వైసిపి నేతలందరూ వచ్చినా, తాము చర్చకు సిద్ధమన్నారు.

తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేర్చామని చెప్పే దమ్ము వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఉందా అని ప్రశ్నించారు. కనీసం గుడివాడలో అయినా ఇచ్చిన హామీలను పూర్తి చేశారా అంటూ నిలదీశారు. 2024 ఎన్నికలకు ముందు మీ ఆస్తులను ప్రకటించి, గత ఎన్నికలకు ముందు మీరు ప్రకటించిన ఆస్తులకు మధ్య వ్యత్యాసాన్ని బహిర్గతం చేయాలని, అవి ఎలా వచ్చాయో చెప్పాలని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.
2024లో బిజెపి నిర్ణయాత్మకమైన శక్తిగా మారుతోందని విష్ణువర్ధన్ రెడ్డి జోస్యం చెప్పారు. ఇక ఇదే సమయంలో టీడీపీని టార్గెట్ చేసిన విష్ణువర్ధన్ రెడ్డి గతంలో మోడీని ఓడించాలని పిలుపునిచ్చిన పార్టీ ఇప్పుడు తమతో పొత్తు కోసం వెంపర్లాడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో బిజెపి ఎక్కువ పార్లమెంటు స్థానాలను గెలుచుకుంటుందని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి జోస్యం చెప్పారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన ఓటుబ్యాంకు లేదని, అలాంటప్పుడు చీలిక ప్రస్తావన ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. 2024 ఎన్నికల కోసం బీజేపీ రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటుందని ఈమేరకు భవిష్యత్ కార్యాచరణపై, పార్టీ వ్యవహరించాల్సిన తీరుపై గన్నవరంలో బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం జరుగుతుందని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications