చంద్రబాబు ఆఫర్ తోసిపుచ్చిన బీజేపీ- మోడీకీ వెన్నుపోటు పొడిచారంటూ- వైసీపీ హ్యాపీ
ఏపీలో బీజేపీతో స్నేహం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు మహానాడు వేదికగా విసిరిన పాచిక విఫలమైంది. అధికార వైసీపీతో పోరులో బీజేపీ, జనసేన వంటి విపక్షాలతో కలిసి పనిచేస్తామంటూ నిన్న చంద్రబాబు ఇచ్చిన ఆఫర్‌ను బీజేపీ తిరస్కరించింది. గతంలో మోడీపై యుద్ధం చేసిన చంద్రబాబు ఇప్పుడు కలిసి పనిచేద్దామంటూ ఆఫర్ ఎలా ఇస్తారంటూ ప్రశ్నించింది. దీంతో టీడీపీ-బీజేపీ స్నేహంపై చెలరేగిన ఊహాగానాలకు త్వరగానే ఫుల్‌స్టాప్ పడినట్లయింది.

బీజేపీకి చంద్రబాబు ఆఫర్
ఏపీలో అధికార వైసీపీతో పోరులో టీడీపీ బలం ఒక్కటే సరిపోదని భావించారో ఏమో నిన్న టిడీపీ మహానాడు వేదికగా చంద్రబాబు ఓ పిలుపునిచ్చారు. వైసీపీతో పోరులో విపక్షాలతో కలిసి పనిచేస్తామంటూ వారికి ఆఫర్ చేశారు. విపక్ష పార్టీలు బీజేపీ, జనసేన, కమ్యూనిస్టులతో కలిసి వైసీపీపై పోరాటం చేస్తామంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. బీజేపీతో పొత్తు కోసం రెండేళ్లుగా ప్రయత్నిస్తున్న బాబు... ఇప్పుడు సడన్‌గా ఎన్నికలు కూడా లేకపోయినా ఈ ఆఫర్ ఇవ్వడంపై చర్చ జరుగుతోంది.

చంద్రబాబు ఆఫర్ తోసిపుచ్చిన బీజేపీ
అధికార వైసీపీపై విపక్ష పార్టీల్ని కలుపుకుని పోరాడతామంటూ చంద్రబాబు ఇచ్చిన ఆఫర్‌ను బీజేపీ తోసిపుచ్చింది. చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందిస్తూ ఇవాళ పార్టీ ఏపీ ఇన్‌ఛార్జ్ సునీల్ దియోధర్ ఘాటుగా ట్వీట్ చేశారు. ముఖ్యంగా చంద్రబాబుకు గతాన్ని గుర్తు చేస్తూ దియోధర్ పెట్టిన ట్వీట్ వైరల్ అవుతోంది. బాబు ఆఫర్‌ను తిరస్కరిస్తున్నట్లు నేరుగానే చెప్పేసిన సునీల్ దియోధర్ టీడీపీతో పాటు వైసీపీపైనా తమ పోరు కొనసాగుతుందన్నారు.

ఎన్టీఆర్ లాగే మోడీకి వెన్నుపోటు
గతంలో మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. ఆ తర్వాత 2019లో ప్రధాని మోడీకి వెన్నుపోటు పొడిచారంటూ సునీల్ దియోధర్ తన ట్వీట్‌లో నిప్పులు చెరిగారు. 2019లో ఆయన అంచనా పూర్తిగా తప్పిందని, వ్యూహాలు విఫలమయ్యాయంటూ వ్యాఖ్యానించారు. 2024లో బీజేపీతో కలిసి పనిచేద్దామంటూ చంద్రబాబు ఇచ్చిన ఆఫర్ టీడీపీని బతికించుకునేందుకే అంటూ సునీల్ దియోధర్ ఆరోపించారు. దీంతో బీజేపీతో స్నేహానికి ప్రయత్నాలు చేయొద్దంటూ చంద్రబాబుకు దియోధర్ చెప్పినట్లయింది.
Recommended Video

దియోధర్ ట్వీట్‌పై వైసీపీ హ్యాపీ
బీజేపీతో కలిసి పనిచేస్తానంటూ చంద్రబాబు ఇచ్చిన ఆఫర్‌ను ఆ పార్టీకి రాష్ట్ర ఇన్‌ఛార్జ్ సునీల్ దియోధర్ తోసిపుచ్చడంపై వైసీపీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిన్న మహానాడులో చంద్రబాబు ప్రకటన చేసిన 24 గంటల్లోనే దియోధర్ ఇలా స్పందించడంపై వైసీపీ నేతలు ఆనందంలో మునిగితేలుతున్నారు. ముఖ్యంగా 2024 ఎన్నికల్లో విజయం కోసం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను బీజేపీ ఆదిలోనే గండికొట్టడంపై వారు ఖుషీగా ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికలు లేకపోయినా చంద్రబాబు చేసిన ప్రకటన ఆయన అవకాశవాద రాజకీయాలకు నిదర్శమని చంద్రబాబుపై సెటైర్లు వేస్తున్నారు.












Click it and Unblock the Notifications