ఆ లెక్క మార్చగలరా లేదా ? సేనకు సేనాని ఏం చెప్పబోతున్నారు ?
గతేడాది ఎన్నికలకు ముందు ఏపీ రాజకీయాల్లో కూటమి పేరుతో జట్టు కట్టి సంచలనం రేపిన పవన్ కళ్యాణ్.. ఎవరూ ఊహించని విధంగా చంద్రబాబును అధికార పీఠంపై కూర్చోబెట్టారు. జనసేన కంటే కూటమే ముఖ్యమనే మెసేజ్ ఇస్తూ మొదలైన వీరి బంధం ఇప్పుడు పవన్ కు తలనొప్పులు సృష్టిస్తోంది. కూటమి కోసం తొలుత తక్కువ సీట్లు తీసుకోవడం, ఇప్పుడు అదే లెక్కతో పదవుల్లోనూ తగ్గాల్సి రావడం, ఈ విషయంలో క్యాడర్ కు నచ్చచెప్పలేని పరిస్దితులు జనసేనానికి ఇబ్బందికరంగా మారాయి. దీంతో ఆ గ్యాప్ ను పూరించుకోవడం పవన్ కు సవాల్ గా మారుతోంది.
గత ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారం చేజిక్కుకోవాలనే పట్టుదలతో టీడీపీ, బీజేపీల్ని కూడా జనసేనతో కలుపుకుని కూటమి ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ .. ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు తీసుకునే విషయంలోనూ పట్టువిడుపులు ప్రదర్శించారు. దీంతో కేవలం 21 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు తీసుకుని అన్నింట్లోనూ గెలిచి చూపించారు. అయితే ప్రభుత్వ ఏర్పాటు తర్వాత కూడా ఇదే లెక్క కొనసాగించక తప్పని పరిస్ధితి పవన్ కు ఎదురవుతోంది.

ముఖ్యంగా నామినేటెడ్ పదవుల పంపకాల విషయంలోనూ చంద్రబాబు.. జనసేనకు కొసరి కొసరి వడ్డిస్తోంది. దీనిపై జనసేన నేతల్లో అసంతృప్తి కనిపిస్తోంది. కొవ్వూరులో జనసేన నేత టీవీ రామారావు ఇదే విషయంపై రోడ్డెక్కి సస్పెండ్ కూడా అయ్యారు. పదవుల విషయంలో జనసేన క్యాడర్ లో నెలకున్న అసంతృప్తికి ఇదే నిదర్శనం. ఇదంతా ఓ ఎత్తయితే తాము నెగ్గిన 21 సీట్లలో పిఠాపురం వదిలేస్తే మిగతా చోట్ల టీడీపీ ఇన్ ఛార్జుల పెత్తనం కొనసాగుతోంది. దీనిపైనా చంద్రబాబుకు పవన్ గట్టిగా చెప్పలేని పరిస్ధితి ఉండటంపై క్యాడర్ లో అసంతృప్తి పెరుగుతోంది.

ఓవైపు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయి ప్రభుత్వంలో కీలకంగా ఉన్నా.. ఎమ్మెల్యేలు, ఇతర నాయకుల విషయంలో మాత్రం టీడీపీ పెత్తనం పెరుగుతోందన్న అసంతృప్తి వారిలో నెలకొంది. అయినా పవన్ ఏం చేయలేకపోతున్నారని, మరోవైపు సర్దుకోమని తమకే చెప్తున్నారన్న ఆవేదన వారిలో కనిపిస్తోంది. దీంతో పవన్ కూ, క్యాడర్ కూ మధ్య గ్యాప్ పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అందుకే సేనతో సేనాని పేరు పెట్టి మరీ విశాఖలో సభ నిర్వహించేందుకు పవన్ సిద్దమవుతున్నారు. అయితే విశాఖ సభలో పవన్ ఆయా అంశాలపై స్పష్టత ఇస్తే సరి. లేకపోతే గ్రౌండ్ లో లెక్కలు మారడం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications