8వరోజు రాజధాని ఆందోళనలు..తుళ్ళూరులో రోడ్లపైనే ఆటలాడుతూ యువత నిరసన
ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానుల ప్రకటనపై వెల్లువెత్తుతున్న నిరసనలు నేటితో ఎనిమిదో రోజుకు చేరాయి. రాజధాని రైతుల పోరాటం ఉధృతం అవుతున్నా పాలకులు పట్టించుకున్న దాఖలాలు లేవు. పైగా రాజధాని రైతుల ఉద్యమం బోగస్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మూడు రాజధానుల ప్రకటనకు నిరసనగా అమరావతిలోని 29 గ్రామాల ప్రజలు రోజుకో రకంగా నిరసన తెలియజేస్తున్నారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 8వ రోజు ఆందోళనలు కొనసాగుతున్నాయి.

వెలగపూడిలో రైతులకు మహిళల మద్దతు
మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. వెలగపూడిలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్న అమరావతి రైతులకు మహిళలు పెద్ద ఎత్తున వచ్చి సంఘీభావం ప్రకటించారు. అమరావతిలోనే రాజధాని ఉంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాజధాని కోసం రైతులు చేసిన త్యాగానికి ఇదేనా ఫలితం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళలు రాజధానిని తరలించవద్దని డిమాండ్ చేస్తున్నారు.

తుళ్ళూరులో రోడ్లమీద మోడీ, అమిత్ షా మాస్కులతో క్రీడలు ... వినూత్న నిరసన
ఇక నేడు కొనసాగుతున్న నిరసనల్లో భాగంగా తుళ్లూరులో రైతులు ,యువత వినూత్న రీతిలో నిరసనకు దిగారు. రాజధాని ప్రాంతంలో రోడ్ల మీదే ఆటలు ఆడుతూ తమ ఆందోళన వ్యక్తం చేశారు. యువత రోడ్లపై క్రికెట్, షటిల్,వాలీబాల్,కారమ్స్, ఆటలను ఆడుతూ తమ నిరసనను తెలియజేశారు. ప్రధాని మోదీ, అమిత్ షా మాస్క్‌లతో యువత ఆటలు ఆడారు. రాజధానిపై జగన్ కక్ష సాధింపు ధోరణి తగదని వారంటున్నారు. తమ జీవితాలతో ఆటలాడుకోవద్దని హితవు పలుకుతున్నారు.

మోడీ రాజధాని విషయంలో జోక్యం చేసుకోవాలన్న రాజధాని రైతులు, యువత
దీక్షల సందర్భంగా కళాశాలలకు సెలవులు ప్రకటించడంతో రోడ్డుపై ఆటలు ఆడాల్సి వస్తోందని యువత చెప్తున్నారు . అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ రాజధాని విషయంలో చొరవ చూపాలని ,రాష్ట్ర ప్రభుత్వానికి దిశా నిర్దేశం చెయ్యాలని యువత కోరుతున్నారు. మరోపక్క నిన్న ఏపీ రాజధాని అమరావతిని తరలించొద్దంటూ రైతుల నిరసనలు, ఆందోళనా కార్యక్రమాలలో భాగంగా మందడం-వెలగపూడిలో రైతుల నిరసనలకు బీజేపీ నేతలు మద్దతు తెలిపారు.

రైతుల పోరాటానికి మద్దతు తెలిపిన ప్రతిపక్ష పార్టీలు
బీజేపీ నాయకులు రైతుల కాళ్లు కడిగి వారికి పాదాభివందనం చేశారు. రాజధాని కోసం 150 ఎకరాలు ఇచ్చిన సుబ్బారావు, నాగరత్నమ్మ దంపతులను సన్మానించారు. దంపతుల కాళ్లు కడిగి ఆ నీళ్లను తలపై చల్లుకున్నారు. ఇక టీడీపీ సైతం రైతుల పోరాటానికి మద్దతునిస్తుంది. జనసేన పార్టీ కూడా జగన్ రాజధాని రైతులకు అన్యాయం చెయ్యొద్దని సీయం జగన్ కు హితవు పలుకుతుంది.












Click it and Unblock the Notifications