హోటల్స్, రెస్టారెంట్ లకు సీసీపీఏ హెచ్చరిక.. అదనపు చార్జీల బాదుడుపై వార్నింగ్!
దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ గ్యాస్ కొరతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గ్యాస్ కొరత కారణంగా చూపుతూ కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు వినియోగదారుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కఠినంగా స్పందించింది. ఈ నేపథ్యంలో Central Consumer Protection Authority (సీసీపీఏ) స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది.
కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు మెనూలో పేర్కొన్న ధరలకంటే ఎక్కువ బిల్లులు
ఎల్‌పీజీ ధరలు, ఇంధన వ్యయం, లేదా ఇతర పేర్లతో అదనపు చార్జీలు వసూలు చేయడం చట్టవిరుద్ధమని పేర్కొంది. సీసీపీఏ తెలిపిన వివరాల ప్రకారం, జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌కు అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు మెనూలో పేర్కొన్న ధరల కంటే ఎక్కువగా బిల్లులు వసూలు చేస్తున్నట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. దీనిపై స్పందించిన అథారిటీ, మెనూలో చూపిన ధరలే తుది ధరలని స్పష్టం చేసింది.

"సర్వీస్ ఛార్జీ" పేరుతో అదనపు వసూళ్లు
ఎటువంటి అదనపు ఛార్జీలు వినియోగదారులపై బలవంతంగా మోపకూడదని పేర్కొంది. ప్రత్యేకంగా "సర్వీస్ ఛార్జీ" పేరుతో అదనపు వసూళ్లు చేయడం కూడా అనుచితమని సీసీపీఏ వెల్లడించింది. వినియోగదారులు ఇష్టపూర్వకంగా చెల్లిస్తే తప్ప, బలవంతంగా సేవా ఛార్జీలు వసూలు చేయడం చట్టపరంగా సరైంది కాదని హెచ్చరించింది.
హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించే హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. వినియోగదారుల హక్కులను కాపాడటంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోందని తెలిపింది. వ్యాపార సంస్థలు పారదర్శకంగా వ్యవహరించాలని, వినియోగదారుల నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించకూడదని సూచించింది. వినియోగదారులు కూడా తమకు అన్యాయం జరిగితే వెంటనే ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
అదనపు ఛార్జీలు వసూలు చేయడం చట్ట విరుద్ధం
మొత్తానికి, ఎల్‌పీజీ కొరతను కారణంగా చూపుతూ అదనపు ఛార్జీలు వసూలు చేయడం చట్టవిరుద్ధమని కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ స్పష్టం చేయడంతో, హోటళ్లు మరియు రెస్టారెంట్లు నిబంధనలు పాటించాల్సిన అవసరం మరింతగా పెరిగింది. నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications