జగన్ కు కేంద్రం బంపర్ ఆఫర్-ఒప్పుకుంటే అమరావతికి వెయ్యికోట్లు-కాదంటే పోటీలో విశాఖ
ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ప్రాధాన్యం కోల్పోయిన అమరావతి రాజధాని అభివృద్ధికి జగన్ సర్కార్ కు మరో బంపర్ ఆఫర్ దక్కింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన కొత్త నగరాల పథకంలో భాగంగా 15వ ఆర్ధిక సంఘం అమరావతి వంటి కొత్తగా అభివృద్ధి చెందుతున్న గ్రీన్ ఫీల్డ్ నగరాలకు వెయ్యి కోట్ల చొప్పున గ్రాంట్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. దీంతో ఇప్పుడు అమరావతి కోసం జగన్ సర్కార్ పోటీ పడుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. కొత్త రాజధానిగా విశాఖను అభివృద్ధికి పరుగులు తీస్తున్న వైసీపీ ప్రభుత్వం.. ఇప్పుడు అమరావతి విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనమే కానుంది.

అమరావతి రాజధాని నిర్మాణం
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వం తెరపైకి తెచ్చిన అమరావతి రాజధాని నిర్మాణం నత్తనడకన సాగింది. నిధుల కొరతతో పాటు ఇతరత్రా సమస్యల కారణంగా అమరావతి దూకుడుగా ముందడుగు వేయలేకపోయింది. దీంతో అమరావతి రాజధాని నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అదే సమయంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ అమరావతి నుంచి రాజధాని తరలింపుకు వ్యూహాలు సిద్ధం చేసింది. ముూడు రాజధానుల ఏర్పాటు ద్వారా రాష్ట్రం మొత్తానికి అభివృద్ధి ఫలాలు పంచుతామని ప్రకటించింది. అయితే ఇందులో భాగంగా చట్ట సభల రాజధానిగా ఉండబోయే అమరావతిని అయినా అభివృద్ధి చేస్తున్నారా అంటే అదీ లేదు. దీంతో అమరావతి రాజధాని నిర్మాణం కలగా మారిపోయింది.

అమరావతికి కేంద్రం సాయం
నిధుల కొరత, మూడు రాజధానుల ఏర్పాటు నేపథ్యంలో మూలనపడిన అమరావతి రాజధాని నిర్మాణాన్ని పట్టాలెక్కించేందుకు వైసీపీ సర్కార్ ఏనాడూ ప్రయత్నించలేదు. తాజాగా విపక్ష నేత చంద్రబాబు ఇంటి ముందు కరకట్ట రోడ్డును మాత్రం వెడల్పు చేయాలని నిర్ణయించిన వైసీపీ సర్కార్ ఆ మేరకు పనులకు శంఖుస్దాపన మాత్రమే చేసింది. దీంతో అమరావతిలో ఇక రాజధాని అభివృద్ధి ముందుకు సాగడం కష్టమేనని అంతా ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఇలాంటి తరుణంలో అమరావతి వంటి నగరానికి నిధులు ఇచ్చేందుకు సిద్ధమన్న కేంద్రం ప్రతిపాదనలు స్ధానికుల్లో ఆసక్తిరేపుతున్నాయి.

కేంద్రం కొత్త నగరాల అభివృద్ధి
దేశవ్యాప్తంగా 8 కొత్త నగరాలు అభివృద్ధి చేయాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా గ్రీన్ ఫీల్డ్ నగరాలు (కొత్తగా నిర్మించే నగరాలు), బ్రౌన్ ఫీల్డ్ నగరాలు (ఇప్పటికే ఉనికిలో ఉండి విస్తరిస్తున్ననగరాలు)కు ఇందులో చోటివ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కొత్తగా అభివృద్ధి చేస్తూ విస్తరణకు సాధ్యమైనంత ఎక్కువ అవకాశాలు ఉండి, అభివృద్ధి పనులు కూడా సులువుగా చేసేందుకు వీలున్న నగరాలను ఎంపిక చేయబోతున్నారు. ఈ రేసులో దేశవ్యాప్తంగా పలు నగరాలు పోటీ పడబోతున్నాయి. ఇందులో కేవలం 8 నగరాలకు మాత్రమే అవకాశం దక్కబోతోంది. ఇలా ఎంపికైన ఒక్కో నగరానికి వెయ్యి కోట్లు వయబిలిటీ గ్యాప్ ఫండ్ కింద కేంద్రం ఇస్తుంది. తద్వారా మిగతా మొత్తాన్ని బహిరంగ మార్కెట్ ద్వారా తెచ్చుకునేందుకు వీలు కూడా కలుగుతుంది.

అమరావతిని పోటీకి పెడతారా ?
కేంద్రం 15వ ఆర్ధిక సంఘం ద్వారా వెయ్యి కోట్లు గ్రాంట్ రూపంలో ఇప్పించే ఈ కొత్త నగరాల ప్రాజెక్టులో ఉండబోయే నగరాల ఎంపిక త్వరలో ప్రారంభం కాబోతోంది. ఇందుకోసం కొన్ని మార్గదర్శకాలను కూడా కేంద్రం విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండే నగరాలు సులువుగా ఈ రేసులో పోటీ పడబోతున్నాయి. మరి ఇదే కోవలోకి వస్తున్న గ్రీన్ ఫీల్డ్ నగరం అమరావతి కూడా ఇందులో పోడే పడేందుకు అన్ని అర్హతలు కలిగి ఉంది. దీంతో జగన్ సర్కార్ అమరావతిని రాజధానిగా ప్రమోట్ చేస్తుందా లేక విశాఖవైపే మొగ్గు చూపుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అమరావతా ? విశాఖా
అమరావతి నగరాన్ని ఎంపిక చేసేందుకు కేంద్రం జారీ చేసిన గ్రీన్ ఫీల్డ్ సిటీల మార్గదర్శకాలు సరిపోతున్నాయి. అలాగే విస్తరిస్తున్న నగరంగా బ్రౌన్ ఫీల్డ్ సిటీగా విశాఖను కూడా పోటీలో నిలిపేందుకు అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు జగన్ సర్కార్ అమరావతిని ప్రమోట్ చేస్తుందా లేక విశాఖను ఎంచుకుంటుందా అన్న చర్చ కూడా మొదలైంది. ఎందుకంటే అమరావతిని పోటీలో నిలిపితే గ్రీన్ ఫీల్డ్ నగరంగా దేశంలో కొత్తగా నిర్మిస్తున్న నగరాల జాబితాలో సులువుగా చోటు దక్కించుకునే అవకాశం ఉంటుంది. అలా కాదని విస్తరిస్తున్న నగరం పేరిట బ్రౌన్ సిటీగా విశాఖను పోటీలో పెడితే దేశంలోని మరెన్నో నగరాలు ఇదే కోవలోకి వస్తున్నాయి. దీంతో పోటీ కూడా ఎక్కువగా ఉంటుంది. అప్పుడు కేంద్రం ప్రత్యేకంగా దృష్టిసారిస్తే తప్ప విశాఖకు ఆ నిధులు వచ్చే అవకాశం లేదు. దీంతో ఇప్పుడు అమరావతా, విశాఖా అన్నది జగన్ సర్కార్ తేల్చుకోవాల్సి ఉంది.
Recommended Video

అమరావతే ఎందుకంటే ?
అమరావతిని కొత్త నగరాల ఎంపికలో భాగంగా పోటీలో నిలిపితే వెయ్యికోట్ల గ్రాంట్ దక్కించుకోవడం సులువుకానుంది ఎందుకంటే కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాల్లో భూసేకరణ, మాస్టర్ ప్లాన్, అనుమతులు, జలవనరులు, గ్యాస్, విద్యుత్ సరఫరా, టెలీ కమ్యూనికేషన్లు, రోడ్లు, రైలు, ఎయిర్ కనెక్టివిటీ, ఘన, ద్రవ వ్యర్ధాల నిర్వహణ, ఆర్ధిక వనరుల లభ్యత వంటి విషయాల్లో అమరావతి ఎప్పుడో పాసైపోయింది. దీంతో ఇప్పుడు అమరావతిని ఈ రేసులో నిలపడం ద్వారా సులువుగా అర్హత సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇవే మార్గదర్శకాల్ని విశాఖకు వర్తింపచేస్తే మాత్రం సగం కూడా అందుబాటులో లేవు. దీంతో విశాఖతో పోల్చినా మెరుగైన అవకాశాలు ఉన్న అమరావతిని ప్రమోట్ చేస్తే కొత్త నగరంగా ఎంపికై నిధులు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications