ఛలో అనుమర్లపూడి నిరసనలకు టీడీపీనేత ధూళిపాళ్ళ నరేంద్ర పిలుపు.. పోలీసుల అరెస్టులతో ఉద్రిక్తత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. రాష్ట్రంలో మట్టి మాఫియాపై తాజాగా టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆందోళనలకు పిలుపునిచ్చిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్ర ను పోలీసులు అరెస్ట్ చేశారు.

నేడు ఛలో అనుమర్లపూడికి ధూళిపాళ్ళ నరేంద్ర పిలుపు
గుంటూరు జిల్లా అనుమర్లపూడి చెరువు వద్ద తెలుగుదేశం పార్టీ నేత దూళిపాళ్ల నరేంద్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు మరికొందరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో మట్టి దోపిడీ జరుగుతోందని ఆరోపిస్తూ ధూళిపాళ్ల నరేంద్ర నేడు ఛలో అనుమర్లపూడికి పిలుపునిచ్చారు.

గుంటూరు జిల్లాలో అక్రమ మట్టి తవ్వకాలపై ధూళిపాళ్ళ నరేంద్ర ఆందోళనలు
గుంటూరు జిల్లా అనుమర్లపూడిలో తాజాగా అక్రమ మట్టి తవ్వకాల పరిశీలనకు వెళ్లిన దూళిపాళ్ల నరేంద్రను మట్టి మాఫియా స్థానిక వైసిపి నాయకులు అడ్డుకున్నారు. ఇక టిడిపి కార్యకర్తలు వారితో వాగ్వాదానికి దిగారు. ధూళిపాళ్ళ నరేంద్ర కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన వైసీపీ కార్యకర్తలు ఆయన కారుపై దాడి చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు ఛలో అనుమర్లపూడి పేరుతో నిరసనలు కొనసాగించాలని భావించిన క్రమంలో వారిని అడ్డుకున్న పోలీసులు అరెస్టులకు పాల్పడ్డారు.

అనుమర్లపూడిలో 144సెక్షన్ ..టీడీపీ నేతల హౌస్ అరెస్ట్ లు
తెలుగుదేశం పార్టీ ఛలో అనుమర్లపూడి గ్రామంలో 144 సెక్షన్ విధించినట్లు పోలీసులు తెలిపారు. అనుమర్లపూడిలో నిరసనలకు అనుమతి లేదని పోలీసులు వెల్లడించారు. అనుమర్లపూడి పరిసర ప్రాంతాల్లో టీడీపీ నేతలు రాకుండా పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పోలీసులు తెలుగుదేశం పార్టీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తూ ఆందోళనలను అడ్డుకుంటున్నారు . టిడిపి జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్, క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మద్దిరాల మ్యానీలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.

అనుమర్లపూడిలో ధూళిపాళ్ళ నరేంద్ర అరెస్ట్
అయితే టీడీపీ సీనియర్ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్ర మాత్రం పోలీసుల కళ్ళు కప్పి అనుమర్లపూడికి చేరుకున్నారు. దీంతో పోలీసులు ఆయనను అక్కడ అరెస్టు చేసి అక్కడి నుండి తరలించారు. పోలీసుల తీరుపై తెలుగు దేశం పార్టీ నేతలు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. అవినీతి అక్రమాలపై ప్రశ్నిస్తుంటే అక్రమ అరెస్ట్ లు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications