రేపు చంద్రబాబు-పవన్ భేటీ- అనంతరం సీఈసీతో సమావేశం..!
ఏపీలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బృందం ఇవాళ రాష్ట్రంలో అడుగుపెట్టింది. మూడు రోజుల పాటు ఇక్కడే ఉండి రాజకీయ పార్టీలతో భేటీలు, ఫిర్యాదుల స్వీకరణ,వాటిపై రాష్ట్ర స్ధాయిలో అధికారులకు సూచనలు చేయడం వంటి కార్యక్రమాలను షెడ్యూల్ చేసుకుంది. ఈ నేపథ్యంలో ఏపీలో నకిలీ ఓట్ల వివాదాలపై విపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రేపు సీఈసీని కలిసేందుకు సిద్ధమయ్యారు.
రేపు ముందుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఇందులో రాష్ట్రంలో ఓట్ల అక్రమ తొలగింపులు, నకిలీ ఓట్లను చేర్చడం, సచివాలయాల సిబ్బందిని బూత్ లెవెల్ ఆఫీసర్లుగా నియమించడం, విపక్షాల ఫిర్యాదులను సీఈవో పట్టించుకోకపోవడం వంటి అంశాలపై చర్చిస్తారు. ఎన్నికల్ని పారదర్శకంగా నియమించడంపై ఈసీకి నివేదించాల్సిన అంశాలపై వీరిద్దరూ చర్చించుకుంటారు. అనంతరం సీఈసీ వద్దకు బయలుదేరి వెళ్తారు.

విజయవాడలో సీఈసీ రాజీవ్ కుమార్ తో పాటు ఇతర ఎన్నికల కమిషనర్లతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా తయారీలో అక్రమాలపై మరోసారి ఫిర్యాదు చేయనున్నారు. వీటిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఈసీని కోరబోతున్నారు. రాష్ట్రంలో నకిలీ ఓట్లపై వైసీపీ నుంచి కూడా భారీ ఎత్తున ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందన్నది కీలకంగా మారింది.
మరోవైపు రేపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి సీఈసీ వద్దకు ఫిర్యాదులు చేసేందుకు వెళ్లబోతుండటాన్ని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తప్పుబట్టారు. గతంలో ఓడిపోయినప్పుడు ఈవీఎంలను తప్పుబట్టారని, ఇప్పుడు ఓట్ల తొలగింపు పేరుతో రాజకీయాలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications