హైకోర్టుకు చంద్రబాబు-బెయిల్ కోసం కాదు అరెస్టు, రిమాండ్ పైనే ? రేపు విచారణ
ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో రిమాండ్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు.. ఏసీబీ కోర్టు ఉత్తర్వుపై తన పోరాటం కొనసాగిస్తున్నారు. ఇప్పటికే రిమాండ్ కాదని హౌస్ అరెస్ట్ లోనే తనను ఉంచాలని కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు.. దీనిపై తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో బెయిల్ కోసం మాత్రం పిటిషన్ దాఖలు చేయడం లేదు. కానీ హైకోర్టులో మాత్రం మరో పిటిషన్ దాఖలు చేశారు.
చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో సీఐడీ అరెస్టు, ఏసీబీ కోర్టు రిమాండ్ కు పంపడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ఆయన తరఫు మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ ఇవాళ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని హైకోర్టు కూడా విచారణకు స్వీకరించింది. అయితే రేపు విచారణ జరపాలని నిర్ణయించింది. అయితే బెయిల్ కోసం కాకుండా చంద్రబాబు సీఐడీ అరెస్టును, ఏసీబీ కోర్టు రిమాండ్ రద్దు కోసమే హైకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

హైకోర్టులో దమ్మాలపాటి శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్లో చంద్రబాబును సీఐడీ నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు చేసిందని ఫిర్యాదు చేశారు. అలాగే సీఐడీ చంద్రబాబును గవర్నర్ అనుమతి లేకుండా అరెస్టు చేసిందన్నారు. సెక్షన్ 17ఏ ప్రకారం గవర్నర్ కు ముందస్తు సమాచారం ఇవ్వాల్సి ఉన్నా అలా చేయలేదన్నారు. అనంతరం ఏసీబీ కోర్టు కూడా సెక్షన్ 17ఏను కాదని రిమాండ్ కు పంపిందన్న అంశాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
దీనిపై హైకోర్టు న్యాయమూర్తి రేపు విచారణ జరిపేందుకు అంగీకరించారు. ఇప్పటికే చంద్రబాబును అరెస్టు చేసిన క్రమంగా సీఐడీ ప్రస్తావించిన సెక్షన్ 17ఏ అంశంపై వివాదం చెలరేగిన నేపథ్యంలో హైకోర్టు ఇవ్వబోయే ఆదేశాలు కీలకంగా మారాయి. అయితే చంద్రబాబు కూడా బెయిల్ కోరకుండా రిమాండ్ రద్దు కోరడం చూస్తుంటే మరో వ్యూహం ఉందనే చర్చ జరుగుతోంది. చంద్రబాబు తాను ఒక వేళ బెయిల్ తీసుకుంటే అరెస్టు సక్రమమే అని అంగీకరించినట్లు అవుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications