పవన్ పై కేసు పెడతారా ? చంద్రబాబు ఫైర్-ప్రశ్నించడమూ నేరమేనా ?
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాల్ని కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్న పవన్ కళ్యాణ్ ఈ క్రమంలో విపక్షాల ఉమ్మడి అభ్యంతరమైన వాలంటీర్ల వ్యవహారాన్ని కెలికారు. వాలంటీర్లు అక్రమంగా డేటా సేకరిస్తూ మహిళల అక్రమ రవాణాకు కారణం అవుతున్నారంటూ పవన్ చేసిన విమర్శలపై స్పందించిన ప్రభుత్వం ఆయనపై ప్రాసిక్యూషన్ కు అనుమతిస్తూ నిన్న నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని విపక్ష నేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు.
జనసేన పార్టీ అధ్యక్షలు పవన్ కళ్యాణ్ పై ప్రభుత్వం కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ఓ ట్వీట్ చేశారు. ఇందులో పవన్ పై కేసు పెట్టడం బుద్దిలేని, నీతిమాలిన చర్య అని చంద్రబాబు విమర్శించారు. తప్పులు చేస్తున్న తప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కూడా నేరం అనే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిపై జగన్ ప్రభుత్వం పరువు నష్టం కేసు పెట్టడం బుద్దిలేని, నీతిమాలిన చర్య అన్నారు.

ప్రజలు తమ సమస్యలను ప్రస్తావిస్తే దాడులు, రాజకీయ పక్షాలు ప్రశ్నిస్తే కేసులు అనేది ఈ రాక్షస ప్రభుత్వ విధానం అయ్యిందంటూ చంద్రబాబు ట్వీట్ లో ఫైర్ అయ్యారు. . ప్రభుత్వం అంటే జవాబుదారీగా ఉండాలని, ఈ అణచివేత ధోరణి మానుకోవాలని సూచించారు. నిబంధనలకు వ్యతిరేకంగా ప్రజల వ్యక్తిగత వివరాలను వాలంటీర్ల ద్వారా సేకరించడాన్ని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే కేసు పెడతారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజల వ్యక్తిగత వివరాలు, కుటుంబ వ్యవహారాలపై ప్రభుత్వం సమాచారం సేకరించడమే తప్పని చంద్రబాబు తెలిపారు. పైగా దాన్ని దుర్వినియోగం చేయడం నీచాతినీచమన్నారు.
కేసు పెట్టాల్సి వస్తే ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న సీఎం జగన్ పై ముందు కేసు పెట్టి విచారణ జరపాలన్నారు. ఈ ప్రభుత్వం పరువు గురించి మాట్లాడడమే పెద్ద జోక్ అన్నారు. 4 ఏళ్ల మీ దిక్కుమాలిన పాలనలో రాష్ట్ర పరువు, ప్రతిష్ట ఎప్పుడో మంటగలిశాయని, రోజులో 24 గంటలూ ప్రజల గొంతు ఎలా నొక్కాలి అనే అరాచకపు ఆలోచనలు పక్కన పెట్టి, రాష్ట్రంలో ఉన్న సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు, వ్యక్తిగత దాడి, మీ ప్రభుత్వ పాపాలను దాచిపెట్టలేవన్నారు. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే సమాధానం చెప్పాలన్నారు.












Click it and Unblock the Notifications